రెవెన్యూ శాఖలో అక్రమాలు.. వరుసగా బయటపడుతున్న రెవెన్యూ ఆఫీసర్ల అవినీతి

రెవెన్యూ శాఖలో అక్రమాలు.. వరుసగా బయటపడుతున్న రెవెన్యూ ఆఫీసర్ల అవినీతి
  • రెవెన్యూ శాఖ మంత్రి వద్దకు 
  • అక్రమ పట్టాల వ్యవహారం 
  • సీరియస్ గా తీసుకుంటున్న కలెక్టర్ 
  • మరోపక్క రెవెన్యూ అక్రమాలపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ అధికారుల అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల జిల్లాలో వరుసగా రెవెన్యూ అధికారుల అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. మరోపక్క గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో క్యాస్ట్ సర్టిఫికెట్ వ్యవహారంలో ఏకంగా తప్పుడు పత్రం అందించడంతో కలెక్టర్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కలెక్టర్ రెవెన్యూ అధికారుల తీరుపై సీరియస్‌‌ గా ఉన్నారు. అక్రమంగా భూపట్టాలను మార్పిడి చేయడంతో ఈ విషయం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి వెళ్లింది.

 ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల అక్రమాలపై ఇంటిలిజెన్స్ అధికారులు రిపోర్ట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి పంపించడంతో కొంతమంది రెవెన్యూ అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. 

తహసీల్దార్ నిర్లక్ష్యం..  భూమి వివాదంపై కలెక్టర్ విచారణ

ఆత్మకూరు(ఎస్) మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన స్వామి రాజ్యలక్ష్మి రెండు దశాబ్దాలుగా తన భూమి కోసం పోరాడుతోంది.  గ్రామంలోని సర్వే నంబర్ 105లో ఉన్న 2.12 ఎకరాల భూమిని స్వామి, రాజ్యలక్ష్మి 20 ఏళ్ల క్రితం కాకి రేణుక నుంచి కొనుగోలు చేయగా రికార్డుల్లో తన పేరును నమోదు చేశారు. పొజిషన్ కూడా ఆమె పేరుతో ఉండగా, ధరణి రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ కాకి రేణుక పేరే కొనసాగుతోంది. పలు మార్లు దరఖాస్తు చేసినా భూమి ఎంట్రీ మార్పు కాలేదు. అనేక సార్లు ఆఫీసుకు వచ్చి పట్టా పాస్‌‌బుక్ కోసం అభ్యర్థించింది. అయితే గత నెల 25న సంబంధిత ఎమ్మార్వో ఆ భూమిని కాకి రేణుక కూతురు అరుణ పేరు మీదకు పట్టా చేశారు.  ఈ విషయంపై ప్రశ్నించగా ఎంక్వైరీ పేరుతో ఆమెను ఇబ్బందులు పెట్టారు. 

అయితే ఆర్ఐ, సర్వేయర్‌‌లు ఇచ్చిన రిపోర్టులు రాజ్యలక్ష్మికి అనుకూలంగా ఉన్నప్పటికీ,  భూమిని పడావు భూమి అనే నెపంతో కాకి రేణుకకు అనుకూలంగా పట్టా జారీ చేశారని తేలింది.  దీంతో జరిగిన అన్యాయంపై బాధితులు ఈ నెల 1న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయగా మంత్రి వెంటనే సూర్యాపేట కలెక్టర్‌‌కు  ఫోన్ చేసి విచారణ చేయాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్ తహసీల్దార్‌‌కు  షోకాజ్ నోటీసు జారీ చేసి ఎంక్వైరీ చేయగా రాజ్యలక్ష్మికి చెందిన భూమి అని తేల్చారు.

 ఇదే ఎమ్మార్వో శెట్టిపాలెం గ్రామంలోని మరో భూమిని సైతం ఇదే తరహాలో పట్టా లేకుండా ఇతరుల పేరు మీదకు మార్చినట్లు తెలిసింది. ప్రస్తుతం తహసీల్దార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఎస్ ఆర్ ఎక్స్టెన్షన్ పేరుతో రిజిస్ట్రేషన్ కు  వచ్చే వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని డబ్బుల కోసం వేధిస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి. 

వేటు వేసేందుకు సిద్ధం 

వరుస ఘటనల నేపథ్యంలో రెవెన్యూ అధికారుల అక్రమాలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సీరియస్ గా ఉన్నారు. రెవెన్యూ మంత్రి వద్దకు ఫిర్యాదులు వెళ్లడంతో కొంతమంది రెవెన్యూ సిబ్బంది పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి రిపోర్ట్‌‌ తీసుకొని సస్పెన్షన్ లేదా బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

క్యాస్ట్ ను బట్టి సర్టిఫికెట్ రేటు...

చిలుకూరు మండల కేంద్రంలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. సుదీర్ఘ  కాలంగా ఈ మండలంలో తిష్ట వేసిన ఓ రెవెన్యూ అధికారి ఈ తతంగాన్ని నడిపించాడు. బీసీ వర్గాల వారికి ఎస్టీ, ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేసి ఒక్కో సర్టిఫికెట్ కు లక్షల రూపాయలు దండుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఒక గ్రామంలో అభ్యర్థి దాఖలు చేసిన సర్టిఫికెట్ విషయంలో ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

దీంతో ఆ సర్టిఫికెట్ ను కలెక్టర్ రద్దు చేయడంతో ఆ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది. ఇదే విధంగా పలువురికి ఆయన నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క ఇదే మండలంలో అండర్ ఏజ్ చెందిన వారికి సైతం కల్యాణ లక్ష్మీ మంజూరు చేసినందుకు లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు తెలిసింది. మండలంలో పట్టా లేని వాటికి సైతం సెటిల్ మెంట్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతుండడంతో ఇటీవల ఇంటిలిజెన్స్ అధికారులు సైతం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సిద్ధం చేశారు. దీంతో సదురు అధికారి 15 రోజుల పాటు సెలవుపై వెళ్లడం గమనార్హం.