మేయర్ పదవిపై ఉత్కంఠ.. గోప్యంగా మహబూబ్నగర్ మేయర్ పేరు

మేయర్ పదవిపై ఉత్కంఠ.. గోప్యంగా మహబూబ్నగర్ మేయర్ పేరు
  • రేపు ఉదయం సీల్డ్​ కవర్​ ద్వారా అభ్యర్థి ప్రకటన
  • డిప్యూటీ మేయర్​కు పోటాపోటీ
  • క్యాంపులోనే మహబూబ్​నగర్​ కార్పొరేటర్లు, నారాయణపేట కౌన్సిలర్లు

మహబూబ్​నగర్, వెలుగు : కొత్తగా ఏర్పాటైన మహబూబ్​నగర్​ మేయర్​ పీఠం ఎవరికి దక్కుతుందోనని పాలమూరు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు వెల్లడై రెండు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్​ పార్టీ ఎవరి పేర్లను కన్ఫాం చేయలేదు.

ముందుగానే పేర్లు ప్రకటిస్తే కొందరు గోడలు దూకే ప్రయత్నాలు చేస్తారనే అనుమానంతో మేయర్​ అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. దీనికితోడు మేయర్​ అభ్యర్థి ఎంపిక సీఎం రేవంత్​రెడ్డిదేనని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన చెప్పిన వారికే ఈ పీఠాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేయనున్నట్లు సమాచారం. అయితే చైర్​ పర్సన్​ స్థానం బీసీ మహిళకు రిజర్వ్​ కాగా, మొదటి సారి ఎవరూ ఈ కుర్చీలో కూర్చున్నా చరిత్రలో నిలిచిపోనున్నారు. 

ఆ ఇద్దరి మధ్యే పోటీ..

మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లో 23 స్థానాలు బీసీలకు రిజర్వ్​ చేయగా, 30 స్థానాలు జనరల్​కు కేటాయించారు. ఈ స్థానాల్లోనూ మెజార్టీ చోట్ల బీసీలు పోటీ చేసి గెలుపొందంగా, గెలిచిన వారిలో చాలా మంది మహిళా కార్పొరేటర్లే ఉన్నారు. దీంతో వారి భర్తలు మేయర్​ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు నుంచి మేయర్​ పీఠంపై మున్సిపల్​ మాజీ చైర్​ పర్సన్​ ఆనంద్ గౌడ్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈయన ప్రాతినిథ్యం వహిస్తున్న 49వ డివిజన్​ అన్​ రిజర్వ్​కు కేటాయించడంతో ఆయన సతీమణి ప్రసన్నను ఎన్నికల బరిలోకి దింపాడు.

ఆమెను ఓడించేందుకు సొంత పార్టీలోని కీలక నేతలే ప్రయత్నాలు చేసినా.. వాటిని అధిగమించి తన భార్యను కార్పొరేటర్​గా గెలిపించుకున్నాడు. కాంగ్రెస్​ సీనియర్​ లీడర్​ అబ్దుల్​ సిరాజ్​ ఖాద్రి కూడా  తన భార్య కోసం మేయర్​ పీఠాన్ని ఆశిస్తున్నాడు. ఆయన సతీమణి హజీరా బేగం 39వ డివిజన్​ నుంచి పోటీ చేసి కార్పొరేటర్​గా గెలిచింది. ఆయనకు కూడా సొంత పార్టీ నేతలు ఓడించేందుకు కుట్రలు చేసినా.. అవి బెడిసికొట్టాయి.

మొత్తానికి ఈ ఇద్దరితో పాటు మరో లీడర్​ సైతం ఆయన సమీప బంధువుకు ఈ పీఠాన్ని కట్టబెట్టాలనే పాలి‘ట్రిక్స్’  చేస్తున్నట్లు చర్చ నడుతస్తోంది. దీనికితోడు ముందు నుంచి మేయర్​ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఆనంద్​ గౌడ్​కు ఈ పీఠం దక్కకుండా చేయాలని మరో లీడర్​ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. కాగా డిప్యూటీ మేయర్​ పీఠాన్ని మైనార్టీలకు కేటాయించాలనే డిమాండ్​ చేస్తున్నట్లు సమాచారం.

సీల్డ్ కవర్​లో పేరు.. 

మేయర్​ పీఠం కోసం సొంత పార్టీలోని లీడర్ల మధ్యే పోటాపోటీ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీకి చెందిన 29 మంది కార్పొరేటర్లు శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ రిసార్ట్​కు తరలి వెళ్లారు. వీరితో పాటు మరో ఇండిపెండెంట్​ క్యాండిడేట్​ కూడా కాంగ్రెస్​కు మద్దతిచ్చి వారి వెంట వెళ్లాడు. అయితే ముందస్తుగా మేయర్​ అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తే కార్పొరేటర్లు జంప్​అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్​ ముందస్తుగా భావించింది. దీనికితోడు స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో బలాబలాలు మారిపోయే అవకాశం ఉండడంతో మేయర్​ పీఠం ‘చేయి’ జారకుండా జాగ్రత్త వహిచినట్లు సమాచారం.

ఈ క్రమంలో మేయర్​ ఎవరనేది సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయించనున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన ఫైనల్​ చేసిన పేరును సీల్డ్​ కవర్​లో భద్రపర్చనున్నారు. ఈ కవర్​ను సోమవారం ఉదయం 11 గంటలకు మహబూబ్​నగర్​ కార్పొరేషన్​కు తీసుకొచ్చి, అందరి సమక్షంలో తెరిచి మేయర్ ఎవరనేది ప్రకటించనున్నారు.