ప్రధానమంత్రులలో ఎవరు గొప్పవారు? ఒక ప్రధానమంత్రి గొప్పతనాన్ని నిర్ధారించే ప్రమాణాలు ఏమిటి? కేవలం వారి పదవీకాలం మాత్రమే కాదు, దేశాన్ని ఏ పరిస్థితులలో నడిపించారన్న అంశం కూడా ముఖ్యం. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం. జవహర్‌లాల్ నెహ్రూ ఒక అసాధారణ జాతీయ నాయకుడు. ప్రపంచ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆయన దేశ రాజకీయాలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా మళ్లించారు.
1936 తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు వివిధ రాజకీయ పార్టీలను, రాజకీయ ధోరణులను ఏకం చేయడంలో నెహ్రూ విజయం సాధించారు. రాజకీయ నాయకత్వం, ప్రజలందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచారు. భారత జాతీయ కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రముఖ నాయకుడిగా నెహ్రూ ఎదిగారు.
నెహ్రూ. బీఆర్ అంబేద్కర్‌తో కలిసి సామాజిక, రాజకీయ న్యాయ ఎజెండాకు అనుగుణంగా
రాజ్యాంగాన్ని రూపొందించారు. నెహ్రూ1947 ఆగస్టు 15న భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. వాయువ్య, తూర్పు బెంగాల్‌ను, పాకిస్తాన్‌కు మినహాయించి భౌగోళిక దేశాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన రాజ్యాంగ రూపకల్పనను సమన్వయం చేయాల్సి వచ్చింది. హోం మంత్రి సర్దార్ పటేల్‌తో కలిసి టెరిటోరియల్నేషన్ ఏర్పాటు చేయడంలో ఆయన అపారమైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. వేర్వేరు భౌగోళిక భూభాగాలను విలీనం చేసి ఒకే భారతదేశంగా ఏకం చేయడం జరిగింది.
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం
స్వాతంత్ర్యం అనంతరం పాలన కోసం ప్రజల తీర్పును కోరడానికి ఎన్నికల సంఘాన్ని నియమించి దేశం ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో ఓటర్లు మొదటిసారిగా క్యూలలో నిలబడి ఓటు వేసి నెహ్రూ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వానికి వెలుపల స్వయంప్రతిపత్తితో ఉండేలా న్యాయస్థానాలు స్థాపించడం జరిగింది. భారతీయులు తమ ప్రాదేశిక భారతదేశంలో తమ ఆకాంక్షల మేరకు సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సార్వభౌమ భారతదేశానికి ప్రతీకగా సమాఖ్య రాష్ట్రాలు, న్యాయవ్యవస్థ, ఆర్మీ, విద్యా సంస్థలను సమన్వయం చేయడమైనది.
నెహ్రూ అలీన విధానం
వివిధ భాషా భూభాగాలు, చారిత్రక ప్రాంతాలు, బహుళ మత వర్గాలు, విభిన్న కుల సమూహాలతో కూడిన భారతదేశం చారిత్రాత్మకంగా ఏర్పడిన ఒక సాంస్కృతిక వ్యవస్థ. ఇంతటి వైవిధ్యభరితమైన భూభాగాలను ఏకం చేసి ఒక దేశంగా భారతదేశాన్ని నిర్మించారు.
ఈ గొప్ప చారిత్రక కార్యం ప్రపంచ శక్తులను ఆశ్చర్యపరిచింది, మన చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలు, జాతీయవాద ఆకాంక్షలు, రాజకీయాలపై అవగాహన ఉన్న నెహ్రూనే భారత రాజ్యాన్ని ఏర్పాటు చేశారని గ్లోబల్ పవర్స్ నమ్మాయి. ఏ విదేశీ శక్తులతోనూ పొత్తు పెట్టుకోకుండా, దేశం స్వీయ గుర్తింపును కాపాడటానికి ఆయన అలీన విధానాన్ని అవలంబించారు.
భారత ఆర్థిక వ్యవస్థ
జాతీయ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ముందుగా ఆర్థిక వ్యవస్థను వలసవాద రహితం చేయాలి. వ్యవసాయం అధికశాతం ప్రజలకు ప్రధాన వృత్తిగా ఉంది. ఇది సుమారు 45 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహారాన్ని అందించడంతో పాటు, 1950ల ప్రారంభంలో పేదరిక స్థాయికి దిగువన ఉన్న 40 శాతం జనాభాను పైకి తీసుకురావాలి.
దీంతో జమీందారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసి సొంత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి భూ సంస్కరణలు అమలుచేశారు. కీలక రంగాలను ప్రభుత్వ అధీనంలో ఉంచడానికి ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని అవలంబించింది. అప్పటికే ఉన్న ప్రైవేట్ పరిశ్రమలు యథాతథంగా కొనసాగాయి. దానిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పిలిచేవారు.
జాతీయ విద్య
వలస విద్యా విధానం క్లర్క్‌లు, వలస సర్వెంట్స్‌ను తయారు చేసింది. సైన్స్, టెక్నాలజీతో కూడిన ఆధునిక విద్యా వ్యవస్థను భారతదేశం అభివృద్ధి చేసుకోలేదని జాతీయ నాయకులు భావించారు. వలసవాద చైతన్యం, యూరోపియన్ జీవనశైలి అభివృద్ధి చెందడానికి ఇది కూడా ఒక కారణం. అందుకే వారు కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు సాంకేతిక సంస్థలు, వైద్య విద్యతోపాటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ వ్యవస్థను స్థాపించారు. ప్రాదేశిక ఐక్యతను సాధించడానికి త్రిభాషా సూత్రాన్ని అనుసరించారు. ఇరవై సంవత్సరాలలో ఇది గ్లోబల్ స్కాలర్స్‌తో సమానంగా ఆధునిక టెక్నోక్రాట్లు, శాస్త్రవేత్తలు, మేధావులను తయారుచేసింది.
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నరేంద్ర మోదీ
జనసంఘ్ అధినేత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రాంతీయ పార్టీల నాయకుడిగా ఎదిగారు. 1950వ దశకంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన తొలి జాతీయవాదులలో ఆయన ఒకరుగా నిలిచారు. కానీ ఆయన ఎక్కువ కాలం దేశ ప్రధానిగా కొనసాగలేకపోయారు. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ పొందిన కార్యకర్త నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన రాజకీయాలను కుల విభజనల నుంచి హిందూత్వ అనే మత రాజకీయాల వైపు మళ్లించారు.
హిందూ రాజకీయాలు జాతీయ ఉద్యమంలో ఒక భాగం, హిందువుల కోసం ఒక దేశంగా ఉండాలనేది ప్రధాన లక్ష్యం. అయితే, నెహ్రూ కాలంలోని ఎన్నికల రాజకీయాలలో ఇది విజయవంతం కాలేదు. 1980ల తర్వాత వచ్చిన రాజకీయ సంక్షోభం, ప్రాంతీయ పార్టీల యుగంలో, హిందూ రాజకీయాలను హిందూత్వ అని పిలిచారు. హిందూత్వ అంటే మెజారిటీ హిందూ జనాభా పేరుతో హిందూ మతాన్ని రాజకీయం చేయడం. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ పొందిన కార్యకర్త, గుజరాత్‌ను పాలించిన నరేంద్ర మోదీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారారు.
పెట్టుబడిదారీ శక్తుల ఇండియా
మన్మోహన్ పాలన తర్వాత, మోదీ 2014 మే 26న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థను మార్కెట్ శక్తులకు తెరిచి, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో విలీనం చేశారు. ప్రస్తుతం దేశం మన్మోహన్ ఇండియా, నెహ్రూవియన్ ఇండియా కాదు, అది పెట్టుబడిదారీ శక్తుల ఇండియా. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మరింత కేంద్రీకృతమైంది. పేదరిక పరిష్కారం కేవలం ప్రైవేట్ రంగం ద్వారానే సాధ్యమని భావించారు.
రాష్ట్రపతి, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థల పరిస్థితి ఏమిటో ప్రతిరోజూ వార్తలలో చూస్తూన్నాం. ఆత్మనిర్భర్ భారత్ వంటి ఆయన విధానాలు ఎక్కువగా మూలధనాన్ని సృష్టించడానికే ఉద్దేశించి రూపొందాయి. కులం నేరుగా రాజకీయాలను శాసిస్తోంది. హిందూత్వం ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో చెప్పలేదు. పెట్టుబడిదారులు ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు. ఇరాన్-, అమెరికా యుద్ధ సమయంలో భారతదేశం తన విధానాన్ని వ్యక్తపరచలేదు. అది కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడింది.
భారతదేశ స్వయంప్రతిపత్తి గల విదేశాంగ విధానం నీరుగారిపోయింది. కేవలం అవకాశవాద వైఖరిని మాత్రమే తీసుకుంది. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలతో సమానంగా పెట్టుబడిదారీ దేశంగా భారత్ మారిందా? ఇది జాతీయవాద లక్ష్యాల నుంచి పక్కదారి పట్టడం కాదా?.
బీజేపీ ఆవిర్భావం
1970ల చివరలో ఆందోళనలు, బంద్‌లు ప్రజాస్వామ్య పనితీరుకు ఆటంకం కలిగించాయి. రైతు కులాల నుంచి రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందిన కొత్త ప్రజా ఒత్తిళ్లు వచ్చాయి. కాంగ్రెస్‌ను సవాలు చేస్తూ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అవి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పటికీ పేదరికం, అసమానతలు వంటి అసలు సమస్యలను గుర్తించడంలో విఫలమయ్యాయి. ఈక్రమంలో ప్రైవేటీకరణ అనే కొత్త విధానం ఒక పరిష్కారంగా కనిపించింది.
ప్రభుత్వ రంగంతో సహా అన్ని వనరులను ప్రైవేటీకరించారు. ఇది తీవ్రమైన రాజకీయ సంక్షోభానికి కూడా కారణమైంది. ఈ సంక్షోభం నుంచి అపారమైన సంస్థాగత బలం కలిగిన భారతీయ జనసంఘ్ కూటమి పార్టీలపై ఆధిపత్యం చెలాయించింది. దాని నుంచే జనతా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.
- ప్రొ. ఇనుకొండ తిరుమలి-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
