- మ్యాజిక్ ఫిగర్ ను మించి బలమున్నా.. తప్పని క్యాంప్ రాజకీయాలు
- ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలింపు
ఖమ్మం, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కొందరు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులపై కన్నేశారు. ఆ కుర్చీని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు తమ గాడ్ఫాదర్ల ద్వారా ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు మంత్రులను కలిసి ఒప్పించేందుకు ట్రై చేస్తున్నారు.
రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాలు, జిల్లా యూనిట్ గా వివిధ రకాల ఈక్వేషన్లను పరిశీలించిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను సీల్డ్ కవర్ ద్వారా పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
తప్పని క్యాంప్ రాజకీయాలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ మినహా అన్ని మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ కు మించి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించినా, ఆ పార్టీలోనూ క్యాంప్ రాజకీయాలు తప్పడం లేదు. సత్తుపల్లి, వైరా, మధిర, కల్లూరు, ఏదులాపురం, అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను సాధించింది. అయినా కల్లూరు, సత్తుపల్లి, వైరాలో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ పార్టీ ముఖ్యనేతలు హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్‌లకు తరలించారు. ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే తీసుకెళ్లారు. కొన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల ఫోన్ లను కూడా తీసుకున్నట్టు సమాచారం.
చైర్పర్సన్ కుర్చీ కోసం రిజర్వేషన్ కలిసి వచ్చినవారు, ఇతర పార్టీలకు చెందిన వార్డు మెంబర్లతో కలిసి ఇబ్బందులు పెట్టకుండా చూసుకోవడంతోపాటు కీలక సమయంలో ఎలాంటి చికాకులు లేకుండా చూసుకునేందుకే క్యాంపులు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆ పార్టీ ముఖ్యనేతలు ఆఫ్‌ది రికార్డు చెబుతున్నారు. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ గెలిచిన అభ్యర్థులను కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు క్యాంపులకు తరలించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు 19 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేటలో 22 వార్డులకు 17 వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. సోమవారం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు ముందు ఆయా మున్సిపాలిటీలకు అభ్యర్థులు చేరుకునేలా ఈ టూర్లను ఏర్పాటు
చేసినట్టు తెలుస్తోంది.
ఎవరికి వారుగా ప్రయత్నాలు..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన పాలేరు నియోజకవర్గంలోకి ఏదులాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు మాత్రం సొంత ఇండ్లకే పరిమితమయ్యారు. ఎవరికి వారు సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నా, ఈ రెండు చోట్ల మంత్రులదే తుది నిర్ణయం కానుంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా కౌన్సిలర్లు మాత్రం క్యాంపునకు తరలివెళ్లారు. సత్తుపల్లిలో 3వ వార్డు కౌన్సిలర్ బొంతు సుమలత కుటుంబ సభ్యులు శనివారం గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.
6వ వార్డులో నాలుగోసారి గెలిచిన తోట సుజలారాణి కుటుంబ సభ్యులు తాము నమ్ముకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయికి ప్రధాన అనుచరుడిగా ఉన్న 22వ వార్డు మెంబర్రెహానాబేగం కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే దంపతులను కలిశారు. మరోవైపు 10వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆడబిడ్డ మట్టా దేవజ్యోతి చైర్ పర్సన్ రేసులో ఉందని ప్రచారం జరుగుతోంది. వైరాలో కాపా చంద్రకళ, బొర్రా ఉమాదేవి ప్రయత్నాలు చేస్తున్నారు. మధిర చైర్ పర్సన్ సీటు వేమిరెడ్డి లక్ష్మీతులసి, కల్లూరు చైర్పర్సన్ సీటు ధరావత్ మోహన్‌కు ఖరారైనట్టు తెలుస్తుంది.
