- ఆసక్తిగా మారిన కేసముద్రం, తొర్రూరు, జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట మున్సిపాలిటీలు
- కీలకంగా స్వతంత్ర, ఎక్స్అఫీషియో ఓట్లు
మహబూబాబాద్/ జనగామ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఐదు బల్దియా స్థానాల్లో చైర్పర్సన్ పీఠం ఎవరికి దక్కనున్నదనే విషయం ఆసక్తిగా మారింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, మరిపెడ స్థానాల్లో క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. వర్ధన్నపేట, మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, జనగామ స్థానాల్లో చైర్పర్సన్ పీఠం ఏ పార్టీని వరిస్తుందన్న ఆసక్తి నెలకొన్నది. ఇందుకోసం ఎక్స్అఫీషియో ఓటర్లు, స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు.
మహబూబాబాద్‌లో..
మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా మున్సిపల్ చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ కు దక్కాలంటే కమ్యూనిస్టుల మద్దతు కీలకం కానుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 1, సీపీఎం 3, సీపీఐ 3, బీజేపీ 1, స్వతంత్రులు 5 స్థానాలు గెలుచుకోగా, ఇప్పటికే సీపీఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతిస్తున్నది. రెబల్ అభ్యర్థులుగా గెలుపొందిన ఐదుగురు కౌన్సిలర్లు సైతం హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి చైర్పర్సన్ కానున్నారనే బలమైన వాదనలున్నాయి. ముగ్గురు కౌన్సిలర్లు ఉన్న సీపీఐ బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతుంది.
ఇక్కడ 20వ వార్డు కౌన్సిలర్‌గా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమార్తె బానోతు తేజశ్వీని ఎన్నిక కావడం, మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్ కావడంతో ఆమెను మున్సిపల్ చైర్మన్ చేయడానికి శంకర్ నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్8 స్థానాలు దక్కించుకోవడంతో ఇక్కడ ఎక్స్అఫీషియో ఓట్ల కోసం రెండు పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, మహబూబాబాద్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ టి.రవీందర్ రావు, కేసముద్రం మున్సిపాలిటీలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో కేసముద్రం మున్సిపాలిటీ సైతం కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుపొందగా, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్యలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటే చెరి సమానం కానున్నాయి.
జనగామలో ఉత్కంఠ..
జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్అఫీషియో ఓట్లపై ఎన్నికల సంఘం ఇచ్చిన స్పష్టతతో మరింత ఉత్కంఠ పెరిగింది. ఎక్స్ అఫీషియోగా ఇద్దరు నమోదు అయినా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ బలాబలాల్లో ఒక్క ఓటే తేడా ఉంది. ఆ ఒక్కరు వచ్చినా.. చైర్మన్ ఎన్నికపై పీఠముడి పడనున్నది. జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్13, కాంగ్రెస్, సీపీఎం కలిపి 13 వార్డులు, నలుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. చైర్ పర్సన్ కావాలంటే 16 మంది కౌన్సిలర్ల మద్దతు కలిగి ఉండాలి.
ఈ రెండు పార్టీలకు అందుకు సరిపడా బలం సమకూరాలంటే ఇండిపెండెంట్ల బలం తప్పనిసరిగా మారింది. ఇండిపెండెంట్లలో భూష పర్వతాలు, మంజుల బీఆర్ఎస్ శిబిరంలో చేరిపోవడం, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియో నమోదుతో ఆ పార్టీ బలం 16కు చేరింది. ఇంకో ఇండిపెండెంట్ సభ్యుడు భాస్కర్ కాంగ్రెస్ శిబిరంలో చేరగా, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్‌గా చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. 15వ వార్డులో ఇండిపెండెంట్‌గా గెలిచిన మారబోయిన పాండు తాను ఎవరివైపో ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు.
వర్ధన్నపేటలో...
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు గానూ 5 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, ఒకరు ఇండిపెండెంట్ గెలుపొందారు. ఇందులో ఇండిపెండెంట్ కాంగ్రెస్‌లో చేరిపోగా, చెరి సమానమైన స్థానాలు ఉన్నాయి. దీంతో చైర్ పర్సన్ పదవి దక్కించుకోవడానికి ఎక్స్ అఫీషియో ఓటు కీలకం కావడంతో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇక్కడ ఓటు వినియోగించుకోనున్నారు. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికే చైర్పర్సన్ పదవి వరించనున్నది.
‘మారబోయిన’ ఎటుమారునో..!
జనగామలో గెలిచిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ మారబోయిన పాండు ఏ పార్టీలో చేరలేదు. ఆయనకు రెండు పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే పాండు బీఆర్ఎస్ శిబిరంలో చేరితే ఆ పార్టీ బలం 17కు చేరి చైర్ పర్సన్ అవకాశం వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ శిబిరంలో చేరితే రెండు పార్టీల బలం 16కే చేరుతుంది. అప్పుడు చైర్మన్ ఎన్నికపై పీఠముడి పడుతుంది. సోమవారం చైర్ పర్సన్ ఎన్నిక కోసం మున్సిపల్ సమావేశం జరుగనుంది. చైర్మన్ ఎన్నిక జరగకుంటే వరుసగా రెండు రోజులు మీటింగ్ నిర్వహణ ఉంటుంది. ఈ రెండ్రోజుల్లోనూ స్పష్టత రాకుంటే ఎన్నికల సంఘానికి పరిస్థితిని వివరిస్తారు. ఆ తర్వాత సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నిక నిర్వహణ జరిపించనున్నారు. నిర్ణీత తేదీన మీటింగ్‌కు ఎంత మంది కౌన్సిలర్లు హాజరైనా వారిలో నుంచే చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌ను ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి.
ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోనున్న స్థానాలు..
మున్సిపాలిటీ స్థానం పార్టీ
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కాంగ్రెస్
మహబూబాబాద్ ఎమ్మెల్సీ రవీందర్రావు బీఆర్ఎస్
కేసముద్రం ఎంపీ పోరిక బల్రాం నాయక్ కాంగ్రెస్
తొర్రూరు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కాంగ్రెస్
తొర్రూరు ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్
జనగామ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్
