యాదాద్రి పవర్ రవాణా భారం రోజుకు కోటి.. 300 కిలోమీటర్ల నుంచి రోజుకు 12 వేల టన్నుల బొగ్గు సప్లై

యాదాద్రి పవర్ రవాణా భారం రోజుకు కోటి.. 300 కిలోమీటర్ల  నుంచి రోజుకు 12 వేల టన్నుల బొగ్గు సప్లై
  • రెండు ప్లాంట్లలో కమర్షియల్​ ఆపరేషన్​ ప్రారంభం
  • గోదావరి ఖని, శ్రీరాంపూర్, సత్తుపల్లి నుంచి రోజుకు 12 వేల టన్నుల బొగ్గు సప్లై
  •  వందల కిలోమీటర్ల దూరం నుంచి రైల్వే ద్వారా సరఫరా
  • అన్ని ప్లాంట్లు మొదలైతే ప్రభుత్వంపై ఏటా రూ.1,600 కోట్లకు పైగా భారం
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం గనులకు దూరంగా ప్లాంట్లు నిర్మించడమే కారణం

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ ​పవర్ స్టేషన్​ (వైటీపీఎస్)లోని రెండు ప్లాంట్లలో ఇలా ఉత్పత్తి మొదలైందో లేదో అలా రవాణా భారం పడ్తున్నది. ప్రస్తుతం ఈ ప్లాంట్​కు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని గోదావరిఖని, శ్రీరాంపూర్, సత్తుపల్లి గనుల నుంచి ప్రతి రోజు 12 వేల టన్నుల బొగ్గు సరఫరా అవుతున్నది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన మూడు ర్యాక్​ల ద్వారా ఇక్కడికి బొగ్గును  తరలిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు రూ.4.5 కోట్ల విలువ గల బొగ్గు సప్లయ్ కోసం రవాణా ఖర్చులు రూ.కోటికి పైగా చెల్లించాల్సి వస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ  ఒక్కోటి 800 మెగావాట్ల చొప్పున రెండు పవర్ ప్లాంట్లలో కలిపి1,600 మెగావాట్లకు సంబంధించిన కమర్షియల్ ఆపరేషన్ (సీవోడీ) జరుగుతున్నది. ఈ సీవోడీ పూర్తయితే ఇక నిరంతరాయంగా విద్యుతుత్పత్తి మొదలైనట్లేనని ఇంజినీర్లు చెబుతున్నారు. మిగతా మూడు పవర్ ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయ్యి,  ప్రతి రోజు ఇక్కడ 4 వేల మెగావాట్ల విద్యుతుత్పత్తి  మొదలైతే రవాణా ఖర్చులు ఏటా ప్రభుత్వంపై రూ.1,600 కోట్లకు పైగా అదనపు భారం తప్పదని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనులకు దూరంగా యాదాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్లు నిర్మించేడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.

మొత్తం సింగరేణి బొగ్గే

నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో వైటీపీఎస్‌‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. జెన్​కో సంస్థ ఆధ్వర్యంలో ఒక్కోటి 800 మెగావాట్ల కెపాసిటీతో 5 ప్లాంట్ల నిర్మాణానికి రూ.29 వేల కోట్లు కేటాయించింది. 2017లో భెల్ కంపెనీతో వర్క్ అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యుత్​ రంగ నిపుణులు తప్పుబట్టారు. ఈ ప్లాంట్ పూర్తయితే రోజుకు సుమారు 50 వేల టన్నుల చొప్పున ఏటా 13 నుంచి 14 మిలియన్ టన్నుల బొగ్గు అవసరమని, ఇంత బొగ్గును 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచి తేవడం వల్ల రవాణా భారం తడిసిమోపెడవుతుందన్నారు. తద్వారా ఉత్పత్తి వ్యయం పెరిగి ప్రభుత్వానికి గుదిబండగా మారుతుందని హెచ్చరించారు. కానీ నాటి బీఆర్ఎస్ సర్కారు వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. కాగా, మొదట జెన్కో సంస్థ 50 శాతం సింగరేణి నుంచి  మరో 50 శాతం విదేశాల నుంచి బొగ్గు కొనుగోలు చేయాలని భావించింది. ఆ తర్వాత మొత్తం సింగరేణి నుంచే బొగ్గు సరఫరాకు నిర్ణయం తీసుకుంది.

రెండు ప్లాంట్లలో మొదలైన సీవోడీ.. 

యాదాద్రి పవర్ ప్లాంట్​లో రెండు ప్లాంట్లు కలిపి 1,600 మెగావాట్ల పవర్ ప్లాంట్లలో సీవోడీ కోసం రోజుకు 12 వేల టన్నుల బొగ్గు వినియోగిస్తున్నారు. ఇందుకోసం 220 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న  గోదావరి ఖని, శ్రీరాం పూర్, సత్తుపల్లి లోని సింగరేణి గనుల నుంచి రైల్వే ర్యాకుల ద్వారా బొగ్గును తీసుకొస్తున్నారు.  జీ9 నుంచి జీ 13 కేటగిరీ బొగ్గును ప్రస్తుతం పవర్​ప్లాంట్లలో వినియోగిస్తున్నారు.  రోజుకు సుమారు రూ.4.5 కోట్ల విలువ గల బొగ్గును వినియోగిస్తే అందులో రైల్వే ట్రాన్స్​పోర్ట్​ కోసమే  రూ.కోటికి పైగా చెల్లిస్తున్నారు.  మరోవైపు అన్ని ప్లాంట్లలో కమర్షియల్​ ఉత్పత్తి మొదలైతే ప్రభుత్వంపై ఏటా రూ.1600 కోట్ల భారం పడ్తుందని,  ఈలెక్కన  ప్రభుత్వ అగ్రిమెంట్ల ప్రకారం 25 ఏళ్లలో సుమారు రూ.40 వేల కోట్ల భారం తప్పదని ఆఫీసర్లు చెప్తున్నారు.  అయితే, కోల్​బెల్ట్ ​పరిధిలో ఎక్కడైన ఈ థర్మల్​ ప్లాంట్​ ఏర్పాటు చేసుంటే ప్రభుత్వానికి రూ.వేల కోట్లు భారం తగ్గేదని స్పష్టం చేస్తున్నారు.