ఏకగ్రీవాలకు ఏదీ ప్రోత్సాహం?

ఏకగ్రీవాలకు ఏదీ ప్రోత్సాహం?

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామపంచాయతీలకు సర్కారు నుంచి ప్రోత్సాహం కరువైంది. గ్రామ స్థాయిలో ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంచేందుకు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం క్యాష్​ రివార్డు ప్రకటించింది. గతంలో రూ.5 లక్షలు ఉన్న మొత్తాన్ని ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచింది. దీనికితోడు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు మరో రూ.5 లక్షలు మంజూరు చేస్తారని ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఈ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చనే ఆశతో సర్పంచ్​లను ఏకగ్రీవంగా ఎన్నుకుని, ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. సర్కారు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా, నిధల మంజూరులో  జాప్యం చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 2,134 మంది సర్పంచ్​లు, 29,985 మంది వార్డ్​ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌మద్దతుదారులే ఎక్కువగా ఉన్నారు.  ఒక్కో పంచాయతీకి పది లక్షల చొప్పున రూ.213.40 కోట్ల నిధులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇస్తామన్న రూ.106.70 కోట్ల నిధులు కూడా ఇప్పటి వరకూ మంజూరు చేయలేదు.

కొత్త పంచాయతీలే ఎక్కువ..

ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల్లో కొత్తగా ఏర్పడిన చిన్న పంచాయతీలే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ గతంలో మెయిన్‌‌‌‌విలేజీకి దూరంగా విసిరేసినట్లుగా ఉండేవి. ఇలాంటి చిన్నచిన్న తండాలు, గూడేలు కూడా గ్రామపంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ఓటర్ల సంఖ్య తక్కువ ఉండడంతో ఏకగ్రీవం చేసుకోవడం ఈజీ అయ్యింది. ఈ జీపీలన్ని మౌలిక వసతుల విషయంలో చాలా వెనుకబడి ఉండడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహక నిధుల కోసం ఏకగ్రీవ సర్పంచ్‌‌‌‌లు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

ఆశ పెట్టుడెందుకు.. మరిచిపోవుడెందుకు

ఏకగ్రీవం చేసుకుంటే గ్రామానికి లక్షల రూపాయల నిధులిస్తమని సర్కారు, నేతలు చెబితే నమ్మినం. మా ఊళ్లో అందరం కలిసికట్టుగా ఎలక్షన్లు అద్దనుకుని ఏకగ్రీవం చేసుకున్నం.  ఎనిమిది నెలలవుతుంది. ఒక్క పైస అచ్చింది లేదు. ఎలక్షన్​ టైంల ఆశ పెట్టుడెందుకు.. ఇపుడిట్ల నజరానా డబ్బుల గురించి మరిచిపోవుడెందుకు? అధికారులనడిగితే మాకెలాంటి ఆర్డర్లు రాలేదంటున్నరు.

‑ రాము,  సర్పంచ్,  మాటైఫారం, నవీపేట్ మండలం, నిజామాబాద్​జిల్లా