IPL 2024: ఎంత పని చేశావు మిచెల్: అభిమాని ఐ ఫోన్ పగులగొట్టిన చెన్నై స్టార్ ప్లేయర్

IPL 2024: ఎంత పని చేశావు మిచెల్: అభిమాని ఐ ఫోన్ పగులగొట్టిన చెన్నై స్టార్ ప్లేయర్

ఐపీఎల్ లో భాగంగా ఆదివారం (మే 5) పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానికి ఊహించని షాక్ తగిలింది. సూపర్ కింగ్స్ ఆటగాడు డారిల్ మిచెల్ గ్రౌండ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సమయంలో బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఒక అభిమాని దగ్గరకు బంతి వెళ్ళింది. మీదకు వచ్చిన బంతిని ఆపేందుకు చేతిని అడ్డం పెట్టాడు. 

బంతి బలంగా తగలడంతో అతని చేతిలో ఫోన్ పగిలిపోయింది. అది ఐ ఫోన్ కావడం విశేషం. దీంతో ఆ అభిమాని షాక్ కు గురయ్యాడు. రెప్పపాటులో తన ఫోన్ మిగలడంతో నిరాశకు గురయ్యాడు. ఇది చూసిన మిచెల్ అతనికి సారీ చెప్పి తన దగ్గర ఉన్న గ్లోవ్స్ ను గిఫ్ట్ గా బహూకరించాడు. దీంతో ఆ అభిమాని సంతోషంతో గంతులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంత పని చేసావ్ మిచెల్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొత్త మంది మిచెల్ గ్లోవ్స్ ఇవ్వడంతో అతన్ని ప్రశంసిస్తున్నారు.    

ఈ సీజన్ లో మిచెల్ పెద్దగా రాణించింది ఏమీ లేదు. రూ. 14 కోట్ల భారీ ధరకు కొనుకున్న చెన్నై ఈ కివీస్ బ్యాటర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే మిచెల్ మాత్రం పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఒక్క హాఫ్ సెంచరీ మినహాయిస్తే మిగిలిన మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.