IPL 2024: గాయంతోనే మ్యాచ్‌లు.. చెన్నై కోసం ధోనీ ఇంత త్యాగం చేస్తున్నాడా..

IPL 2024: గాయంతోనే మ్యాచ్‌లు.. చెన్నై కోసం ధోనీ ఇంత త్యాగం చేస్తున్నాడా..

చెన్నై సూపర్ కింగ్స్ తో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకు విడదీయరాని బంధం ఉంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి చెన్నై జట్టుకే ఆడుతూ విజయవంతంగా నడిపించాడు. ఇప్పటివరకు 5సార్లు టైటిల్ అందించి ఐపీఎల్ లోనే బెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. ప్రస్తుత సీజన్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీకి ఇదే చివరి టోర్నమెంట్ అని అందరూ భావించారు. బ్యాటింగ్ లో లోయర్ ఆర్డర్ లో వస్తూ పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. అయితే ధోనీ ఇంత చివర్లో బ్యాటింగ్ కు రావడంతో చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

ఆదివారం (మే 5) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 9 వ స్థానంలో వచ్చి డకౌట్ కావడంతో ధోనీ జట్టులో అనవసరం అని మండిపడ్డారు. ధోనీ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావడానికి అసలు కారణం తెలిసిపోయింది. నివేదికల ప్రకారం మాహీ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. కండరాలు చిట్లడం వల్ల ధోనీ గ్రౌండ్ లో సరిగా పరిగెత్తలేకపోతున్నాడు. అందుకే చివర్లో వచ్చి పరుగుల మీద కాకుండా కేవలం హిట్టింగ్ పైనే దృష్టి పెట్టాడు. 

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీ మినహాయిస్తే మరో వికెట్ కీపర్ లేడు. వికెట్ కీపర్ కాన్వే ఇప్పటికే గాయంతో ఐపీఎల్ కు దూరం అయ్యాడు. దీంతో ధోనీ గాయంతోనే వికెట్ కీపర్ గా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2023 ప్రారంభం నుంచి ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కాలి ఐస్‌ ప్యాక్ వేసుకొని కూడా కొన్ని సార్లు కనిపించాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సర్జరీ విజయవంతం చేసుకొని 2024 ఐపీఎల్ సీజన్ లో అడుగు పెట్టాడు. అయితే మరోసారి అతనికి గాయం తిరగబెట్టడంతో జట్టు కోసం త్యాగం చేస్తూ తన ఆటను కొనసాగిస్తున్నాడు.