తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో  పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రమంతటా పదోతరగతి పరీక్షల్ని  వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. 

కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుండడంతో  పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలైంది. పంజాబ్ తరహాలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ పిటీషన్ లో పేర్కొన్నారు.  దీంతో పరీక్షల నిర్వహణపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పరీక్షల నిర్వహణపై నివేదిక అందించాలని తెలిపింది. కోర్ట్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు నివేదికను తయారు చేసి హైకోర్ట్ కు అందజేశారు.

నివేదికపై స్పందించిన కోర్ట్ విచారణ చేపట్టి..పదో తరగతి పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్ ను విడుదల చేయాలని సూచించింది. కోర్ట్ తీర్పుతో అప్రమత్తమైన ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జులై 8 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

కానీ  రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేసులు పెరుగుతుంటే పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ పిటిషన్ హైకోర్ట్ కు తెలిపారు. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలపై ఏకీభవించిన  హైకోర్ట్ మరోసారి పదో తరగతి పరీక్షల పై విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా జీహెఎంసీలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.  అందుకు ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేస్తే మళ్లీ పేపర్ ను తయారు చేయడంతో పాటు మరోసారి పరీక్షల్ని నిర్వహించడం కష్టంగా ఉంటుందని , టెక్నికల్ సమస్యలు తలెత్తుతాయని కోర్ట్ కు విన్నవించుకుంది.

ప్రభుత్వం తీరుపై స్పందించిన హైకోర్ట్ పిల్లల పరీక్షల కన్నా ప్రాణాలు ముఖ్యమని, పంజాబ్ తరహాలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. కరోనా కేసులు పెరుగుతున్నాయని, పిల్లల కు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్ట్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది.

కోర్ట్ తీర్పుతో డైలమాలో పడ్డ ప్రభుత్వం ఉన్నతాధికారులతో చర్చించి..రాష్ట్రమంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని, ప్రస్తుతానికి పదోతరగతి పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. 

  కాగా పదో తరగతి పరీక్షల నిర్వహణపై జూన్ 7న  విద్యాశాఖ అధికారులు సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అధికారుల భేటీ తరువాత పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.