లేని మైనింగ్ పేరిట 100 కోట్ల భూమికి టెండర్

లేని మైనింగ్ పేరిట 100 కోట్ల భూమికి టెండర్

వరంగల్ రూరల్ జిల్లా కొత్తగట్టులో ఎమ్మెల్యే కొడుకు లీజ్ దందా
వరంగల్‍ రూరల్‍, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే కొడుకు వరంగల్ రూరల్ జిల్లాలో భారీ భూభాగోతానికి తెరలేపిండు. నాన్న ఎమ్మెల్యే, మామ లోకల్గా క్వారీ బిజినెస్మన్, ఇక్కడి మరో ఎమ్మెల్యే దగ్గరి చుట్టమే. ఇంకేముంది? ఆత్మకూర్ మండలం కొత్తగట్టులోని తన క్వారీ పక్కనే ఉన్న రూ.100కోట్ల విలువైన 48 ఎకరాల సర్కారుభూములకు ఎసరుపెట్టిండు. అందులో ఖనిజాలు ఉన్నాయనే సీన్ క్రియేట్ చేసి, రెవెన్యూ ఆఫీసర్ల సాయంతో ఇప్పటికే 26 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నడు. మరో 22 ఎకరాల ఫైలును ఆఫీసర్ల టేబుల్ మీద పెట్టి పర్మిషన్ కోసం చూస్తున్నడు.

ఇద్దరు తహసీల్దార్ల సాయంతో 26 ఎకరాలు..

పెద్దపల్లి జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యే కొడుకు, ఆయన మామ కలిసి వరంగల్‍ రూరల్‍ జిల్లా ఆత్మకూర్‍ మండలంలోని కొత్తగట్టు వద్ద శ్రీసాయి క్రషర్స్ పేరుతో క్వారీ నడుపుతున్నారు. ఈ క్రషర్‍ నిర్వహణకు కావాల్సిన మైనింగ్‍ ఇతరత్రా పూర్తిస్థాయి పర్మిషన్లు ఇప్పటివరకు రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. దీని పక్కనే దాదాపు 68 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 20 ఎకరాలను పేద రైతులకు అసైన్చేయడంతో కొన్నేండ్లుగా దున్నుకుంటున్నారు. మిగిలిన 48 ఎకరాల భూమి పరకాల మెయిన్‍రోడ్డును ఆనుకుని ఉండడంతో ఎకరం రూ. కోటిన్నర నుంచి రూ.2 కోట్లు పలుకుతోంది. ఎలాగైనా దానిని చేజిక్కించుకోవాలనే కుట్రకు మామా అల్లుళ్లు తెరలేపారు. ఇందుకోసం ఎమ్మెల్యే కొడుకు పక్కా స్కెచ్ వేశాడు. ఆ భూముల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని దానిని వెలికితీసేందుకు తమకు లీజ్‍కు ఇవ్వాలని రెవెన్యూ, మైనింగ్‍ శాఖకు అప్లై చేసుకున్నాడు . ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తన పలుకుబడిని ఉపయోగించి, 48 ఎకరాలను కొద్దికొద్దిగా కబ్జా చేయాలని భావించాడు. 2018లో ఓ తహసీల్దార్ ద్వారా 18 ఎకరాలు, 2019లో మారిన మరో తహసీల్దార్ ద్వారా 08 ఎకరాలు తన ఖాతాలో వేసుకున్నాడు. మూడోసారి సైతం మరో తహసీల్దార్ సాయంతో అక్రమ లీజ్‍కు రూట్‍ క్లియర్ చేస్తుండగా, భూభాగోతం బయటపడింది.

గ్రామస్థులకే మస్కా కొట్టిన్రు..

అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉన్న మామాఅల్లుళ్లు కొత్తగట్టు ఊరి జనాలకే మస్కా కొట్టారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ల్యాండ్‍ను ఎవరికి తెలియకుండా తమ పేరున రాయించుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ హరిత నెలన్నర క్రితం విలేజ్‍ విజిట్‍చేశారు. గ్రామస్థులు తమకు డబుల్‍బెడ్‍రూం ఇండ్లు, గోదాములు, శ్మశాన వాటిక కావాలని అడిగారు. కావాల్సిన భూమి ఉంటే మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పగా, 48 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న విషయాన్ని సర్పంచితో సహా జనాలు వివరించారు. దానిని ఆఫీసర్లకు చూపించేందుకు వెళ్లగా, మామాఅల్లుళ్లు అడ్డుకున్నారు. అక్కడున్న 48 ఎకరాలు ప్రభుత్వ భూమి కాదనీ, 25 ఏళ్లు తాము లీజుకు తీసుకున్నామని చెప్పడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. జిల్లాకు సంబంధంలేని వ్యక్తి రాజకీయ పలుకుబడితో తమ ఊరిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించడాన్ని తట్టుకోలేకపోయారు. గ్రామంలో క్వారీ లైసెన్స్ గడువు ముగిసినా బాంబులతో బ్లాస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఊరికి ఉపయోగపడే ప్రభుత్వ భూములను అధికారులు, అక్రమంగా లీజ్‍కు ఇవ్వడంపై రోడ్డెక్కారు. లోకల్గా ఆఫీసర్లకు వినతిపత్రాలు అందించారు. లాభం లేకపోవడంతో జిల్లా కలెక్టర్‍ హరితను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

అధికారులే అన్నీ తామై..

కోట్ల రూపాయల విలువ జేసే ప్రభుత్వ భూములను అధికార పార్టీ లీడర్కు అప్పగించేందుకు ఆఫీసర్లు పోటీపడి సహకరించారు. ప్రభుత్వ భూమిలో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని చెప్పగానే గుడ్డిగా అనుమతులిచ్చారు. అవి ఏ ఖనిజాలు? ఎంత మోతాదులో ఉన్నాయి? ఆ భూమిలో మినరల్స్ ఉన్నాయని ఎలా తెలిసింది? ఎప్పుడు పరీక్షించారు? ప్రభుత్వ స్థలంలో ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు టెస్టులు చేస్తుంటే ఏంచేస్తున్నారు? అనే ప్రశ్నలకు ఆఫీసర్ల వద్ద సమాధానాలు లేవు. అదీగాక క్వారీ లైసెన్స్ గడువు ముగిసినా, క్రషర్‍ నిర్వహణకు కావాల్సిన అనుమతులు లేకున్నా మైనింగ్‍ అధికారులూ పట్టించుకోవడంలేదు. ఎస్సారెస్పీ కెనాల్ కట్టపై నుంచి వందలాది లారీలు నడుస్తుంటే ఆ శాఖ ఆఫీసర్లు అటువైపు చూడడంలేదు.

అక్రమ లీజును రద్దు చేయాల్సిందే..

కొత్తగట్టు గ్రామానికి ఉపయోగపడాల్సిన భూములను ఆఫీసర్లు జిల్లాకు సంబంధంలేని వ్యక్తికి అప్పగించడం అక్రమం. అన్యాయం. లేని మైనింగ్ సృష్టించి కబ్జా చేశారు. ఈ మోసాన్ని ఇప్పటికే కలెక్టర్‍ దృష్టికి తీసుకెళ్లాం. వాళ్ల క్వారీ, క్రషర్ కూడా రూల్స్కు విరుద్ధంగా నడుస్తున్నాయి. ఆఫీసర్లు వెంటనే స్పందించి అక్రమ లీజును రద్దు చేయాలే. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాలె. ఊరి ప్రజలకు డబుల్‍బెడ్‍రూం ఇండ్లు, గోదాంలు కట్టించాలె. లేదంటే మరో ఉద్యమానికి రెడీ అవుతాం.
-బోళ్ల నరేష్‍, కొత్తగట్టు సర్పంచ్
ఇప్పుడు.. మైనింగ్‍ పర్మిషన్లు ఇవ్వట్లే

కొత్తగట్టు గ్రామానికి చెందిన భూముల్లో క్వారీ తవ్వకాలకు అనుమతి కోరుతూ మైనింగ్‍ ఏడీ ఆఫీసులో అఫ్లై చేసింది వాస్తవమే. అది అక్కడి నుంచి వచ్చి ఇంకా పెండింగ్లోనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అయితే ఇవ్వలేం. అన్ని సక్రమంగా ఉన్నా.. ఈసీ (ఎన్విరాన్‍మెంట్‍ క్లియరెన్స్), సీఎఫ్‍ రావడానికి ఇంకో ఏడాది పడుతుంది. మైనింగ్‍కు సంబంధించి ఇప్పట్లో ఎటువంటి పర్మిషన్లు ఇవ్వద్దని హైదరాబాద్ లెవల్లో మాకు ఆదేశాలున్నాయి. ఇవేవీ లేకుండా సైట్‍వద్ద పనులు చేయడానికి వీల్లేదు.
మధుసూదనరెడ్డి, మైనింగ్ శాఖ వరంగల్‍ డీడీ

లోకల్ ఎమ్మెల్యేపై  ఊరోళ్లు నారాజ్‍

కొత్తగట్టు గ్రామానికి ఆస్తిగా ఉన్న 48 ఎక రాల ప్రభుత్వ భూమిని జిల్లాకు సంబంధం లేని వ్యక్తి లీజు పేరుతో రాయించుకుం టుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని గ్రామప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసి గెలిపిం చినందుకు తమకు డబుల్‍బెడ్‍రూం ఇండ్లు, గోదాంలు, వస్తాయని ఆశిస్తే ఏకంగా ఎమ్మెల్యే బంధువులే విలువైన భూమిని ఆక్రమించడంపై మండిపడు తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు గతంలో ఇచ్చిన లీజులను రద్దు చేసి, ఆ భూమిలో తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు, గోదాములు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి