భూదాన్​ భూమి ఆక్రమణతో ఉద్రిక్తత

భూదాన్​ భూమి ఆక్రమణతో ఉద్రిక్తత

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న విలువైన భూమిలో కొందరు గుడిసెలు వేసేందుకు ప్రయత్నించడం శనివారం ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం అర్బన్​ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 147, 148 ,149 లో 62.7 ఎకరాల భూమి ఉంది. తమకు 2014లో భూదాన్​ బోర్డు 100 గజాల చొప్పున ఇచ్చిన పట్టాలున్నాయంటూ గత వారం రోజులుగా నిరుపేదల సంఘం కమిటీకి చెందిన కొందరు వ్యక్తులు అక్కడ రేకులతో ఇండ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో పోలీసులతో కలిసి రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్,  పోలీస్​ కమిషనర్​ విష్ణు వారియర్​ కూడా అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. వారి దగ్గర ఉన్న భూదాన్​ బోర్డు పట్టా పేపర్లను పరిశీలించారు. రెవెన్యూ పట్టాలుంటే చూపించాలని కోరగా.. లేవని వారు సమాధానమిచ్చారు. భూదాన్​ బోర్డు ఇచ్చిన పట్టాలపై హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్నదని, ప్రభుత్వం తరపున రెవెన్యూ డిపార్ట్ మెంట్ కూడా కౌంటర్​ దాఖలు చేసిందని ఆఫీసర్లు వివరించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరూ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి జేసీబీలు, డోజర్లతో తాత్కాలిక నిర్మాణాలను పోలీసులు తొలగించారు. ఈ సమయంలో జేసీబీలను అడ్డుపడేందుకు కొందరు మహిళలు ప్రయత్నించగా, మహిళా పోలీసులు అక్కడి నుంచి వారిని బలవంతంగా పక్కకి తీసుకెళ్లారు.