100 రోజుల యాక్షన్ ప్లాన్..1000 రోజులు దాటినా కదలట్లే

100 రోజుల యాక్షన్ ప్లాన్..1000 రోజులు దాటినా కదలట్లే
  • హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తామన్న కేటీఆర్ 
  • చేయని పనులు ముందే పూర్తి చేసినవీ యాక్షన్ ప్లాన్ కిందికి..
  • ఎలక్షన్లు వస్తుం డటంతో మరోసారి హడావుడి

హైదరాబాద్, వెలుగుఎన్నో ప్రకటనలు, మరెన్నో హామీలతో టీఆర్ఎస్​ గ్రేటర్ హైదరాబాద్​ పీఠాన్ని దక్కించుకుంది. ఇక ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకునే విధంగా పాలన కొనసాగిస్తామని చెప్పింది. ‘వంద రోజుల్లో హైదరాబాద్​సిటీ రూపురేఖలు మార్చేస్తం.. రోడ్లు, శ్మశాన వాటికల నుంచి పార్కులు, ప్లేగ్రౌండ్ల నిర్మాణందాకా డెవలప్​ చేస్తం’అంటూ 2016 ఫిబ్రవరి 18న మంత్రి కేటీఆర్​ 100 డేస్​ యాక్షన్​ ప్లాన్​ ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో మౌలిక వసతుల డెవలప్​మెంట్​తోపాటు బ్యూటిఫికేషన్, పాలనా సంస్కరణలూ ఉంటాయని చెప్పారు. 26 ప్రాధాన్య అంశాలను ప్రకటించారు. వీలైనన్ని సేవల ఆన్ లైన్, కనీస వసతులైన రోడ్లు, పార్కులు, స్మశాన వాటికల నిర్మాణం, నల్లా కనెక్షన్లు, ఎల్ఈడీ లైట్లు, బిల్డింగ్, లే ఔట్​ పర్మిషన్ల ప్రక్రియ వేగవంతం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, ప్లేగ్రౌండ్ల నిర్మాణం వంటి అంశాలను చేర్చారు. కానీ ఇందులో రెండు మూడు పనులు తప్ప చాలా వరకు ఎక్కడిక్కడ్నే ఉండిపోయాయి. వంద రోజులు కాదు.. వెయ్యి రోజులు దాటిపోయినా చాలా పనులు అడుగు కూడా ముందుకు పడలేదు.

కోట్లు మింగినా నాలాలు మారలే..

సిటీలో 815 కిలోమీటర్ల పొడవునా నాలాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసేందుకు రూ.22.79 కోట్లతో 317 పనులు చేపట్టారు. వానాకాలానికి ముందే నాలాలను క్లీన్​ చేసి, పూడిక తొలగిస్తామని నేతలు ప్రకటించారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఇటీవలి వానలకు నాలాలు పొంగిపొర్లగా, రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచాయి, లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇప్పటికీ ఏటా నాలాల ఆధునీకరణ పేరిట బల్దియా కోట్లు ఖర్చు చేస్తున్నా జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక హుస్సేన్​ సాగర్​ను ప్రక్షాళన చేస్తామని యాక్షన్​ ప్లాన్​లో ప్రకటించారు. కానీ ఇప్పటికీ కంపు ఏమాత్రం వదలని పరిస్థితి.

చేయని పనులు కూడా చేసినట్టు చెప్పి..

హైదరాబాద్​ వ్యాప్తంగా 20 కాలనీల్లో పార్కులను వంద రోజుల ప్రణాళికలో కొత్తగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ.కోటిన్నరతో పనులు చేపట్టారు. సనత్‌‌ నగర్‌‌లో అంతకుముందే ఐదు పార్కులను డెవలప్​ చేసినట్టు అధికారులు చూపించారు. ఇక, జూబ్లీహిల్స్‌‌లో ఎకరం విస్తీర్ణంలో రూ.కోటి నిధులతో నిర్మించిన జపనీస్‌‌ గార్డెన్‌‌ ను 2016 జనవరి 3న మంత్రి మహమూద్ ఆలీ ప్రారంభించారు. కానీ వంద రోజుల ప్రణాళికలో కట్టినట్టుగా మేలో విడుదల చేసిన ప్రొగెస్ రిపోర్టులో పెట్టారు.

మళ్లీ ఎన్నికలు రాగానే హడావుడి

రెండు నెలల్లో జీహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగే చాన్స్‌ ఉండడంతో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు హడావుడి మొదలుపెట్టారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బస్తీ దవాఖానాలు, కేబుల్ బ్రిడ్జి పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులను లాక్ డౌన్ టైంలో చేపట్టి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడో ఏండ్ల కిందే పూర్తికావాల్సిన పనులను ఇప్పుడు హడావుడిగా ముగించే పనిలో పడ్డారు.

హామీలన్నీఉత్తగనే మిగిలినయ్

  • దాదాపు రూ.200 కోట్లతో 560 బీటీ రోడ్లు నిర్మించామని వంద రోజుల ప్రణాళిక ప్రోగెస్ రిపోర్టులో వెల్లడించగా.. ఇప్పటికీ ప్రధానమైన మార్గాలు, కాలనీల్లో నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి.
  • సీఎం కేసీఆర్‌‌ సికింద్రాబాద్​ మోండా మార్కెట్లో పర్యటించి.. సిటీ అంతటా మోడల్‌‌ మార్కెట్లు నిర్మిస్తామని ప్రకటించారు. వంద రోజుల ప్రణాళిక టైంలోనే 40 మోడల్ మార్కెట్లను అందుబాటులోకి తెస్తామన్నరు. కానీ తర్వాత ఏడాది గడిచినా నాలుగే వినియోగంలోకి వచ్చాయి. మొత్తంగా 200 మోడల్‌‌ మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ పదో వంతు కూడా ఏర్పాటు చేయలేదు.
  • జూబ్లీహిల్స్‌‌లోని మహా ప్రస్థానం తరహాలో హైదరాబాద్​ సిటీలోని అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని కేటీఆర్​ ప్రకటించారు. రూ.10 కోట్లతో పనులు చేపడతామన్నారు. ప్రధానమైన ప్రాంతాల్లో ఒక్కో శ్మశాన వాటికకు రూ.కోటి ఖర్చు చేస్తామన్నారు. 2016లో చేపట్టిన సనత్​నగర్, బల్కంపేట శ్మశాన  వాటికల పనులు సాగుతున్నాయి. ఎన్నికల కారణంగా ఇప్పుడు వేగం పెంచారు.
  •  బస్సుల్లో ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉండేలా.. బస్ బేలు, షెల్టర్లను నిర్మిస్తామని, ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్న హామీలు నామ్​కే వాస్తేగా మారిపోయాయి. ఏదో పేరుకు ఒకట్రెండు చోట్ల ఏర్పాటు చేసి వదిలేశారు.     ఇంటింటికి తడి, పొడి చెత్త విడివిడి సేకరణ కోసం డస్ట్ బిన్స్ సౌలత్ తెస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికీ చెత్త సేకరణ పరిస్థితి మారలేదు.
  • ఓఆర్ఆర్ పై సైకిల్‌‌ట్రాక్స్ ఇప్పటికీ ప్రతిపాదన దశల్లోనే ఉంది.
  • ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, వాటర్‌‌ ట్యాంకుల్లో కలుషిత నీరు కలవకుండా ఏర్పాట్లు, ఇంకుడు గుంతల నిర్మాణాల హామీలైతే ఊసే లేకుండా పోయాయి.