తహసీల్దార్ నాగరాజు కేసులో ముగిసిన ఏసీబీ విచారణ

తహసీల్దార్ నాగరాజు కేసులో ముగిసిన ఏసీబీ విచారణ

హైద‌రాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ ముగిసింది. విచారణలో భాగంగా మూడు రోజుల పాటు నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆఖ‌రి రోజైన‌ గురువారం నాగరాజు, అంజిరెడ్డి, శ్రీనాథ్‌, వీఆర్‌ఏను 3 రోజులు ఏసీబీ అధికారులు విచారించారు.

అయితే నిందితులు శ్రీనాథ్‌, అంజిరెడ్డి విచార‌ణ‌కు సహకరించలేదని ఏసీబీ డి.ఎస్.పీ. సూర్యనారాయణ తెలిపారు. తహసీల్దార్ నాగరాజు, ఆయన భార్య ఇద్దరు కలిసి లాకర్ ల వ్యవహారం పై ఏసీబీ అధికారుల‌ను తప్పుదోవ పట్టించారని తెలిపారు. శ్రీనాథ్ డబ్బులు వరంగల్ నుంచి తీసుకువచ్చినట్లు , అవి లంచం కోసమే తెచ్చినట్లు అంగీకరించాడన్నారు. డబ్బులు దొరికిన బాగ్ ని శ్రీనాథ్ వెయ్యి రూపాయలు ఇస్తే వి.ఆర్.ఓ కొనుక్కొని వచ్చాడని, ఈ విషయాన్ని వి.ఆర్.ఓ ఒప్పుకున్నాడని అన్నారు.

ఈ కేసుతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్దారణ కాలేద‌ని వెల్ల‌డించారు. తదుపరి విచారణ జరగాల్సి ఉందని, అందులో రేవంత్ ప్రమేయం ఉంద‌ని తేలితే ఆయనను కూడా విచారిస్తామ‌ని చెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలు, కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కీసర జిల్లాకు సంబంధించిన మరికొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బందిని విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది