కరెంట్​ బాదుడు రూ.800 కోట్లు..యావరేజ్ పేరుతో అడ్డగోలు బిల్లులు

కరెంట్​ బాదుడు రూ.800 కోట్లు..యావరేజ్ పేరుతో అడ్డగోలు బిల్లులు

హైదరాబాద్‌‌, వెలుగు50 యూనిట్లలోపు వాడుకునే పేదలు, 100, 200 యూనిట్లలోపు వాడుకునే మిడిల్​క్లాస్​ జనంపై కరెంట్​ బిల్లుల బండ పడింది. ఏప్రిల్‌‌, మే నెలల్లో మీటర్‌‌ రీడింగ్‌‌ తీయకుండా జూన్‌‌లో రీడింగ్‌‌ తీసి మూడు నెలలకు బిల్లులు ఇవ్వడంతో స్లాబ్‌‌లు మారి బిల్లులు భారీగా వచ్చాయి. నాన్‌‌ టెలిస్కోపిక్‌‌ విధానంతో యావరేజీగా తీసిన రీడింగ్‌‌లో ఒక్క యూనిట్‌‌ మారినా వేలల్లో బిల్లులు ఎక్కువగా వచ్చాయి. ఇలా 97.60 లక్షల మంది గృహ వినియోగదారులపై రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకూ అదనపు భారం పడినట్టుగా తెలుస్తోంది. మార్చి, ఏప్రిల్‌‌ నెలల్లో తక్కువ కరెంట్​ వాడుకుని, మేలో ఎక్కువ వాడుకున్న వారిపై ఎక్కువ ఎఫెక్ట్​ పడింది. పూర్తి బిల్లులు కట్టకపోతే కట్‌‌ చేస్తామని మంత్రి చెప్పడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. దీంతో సోషల్‌‌ మీడియా ద్వారా కరెంట్​ సంస్థలకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.

తక్కువ వాడే వారిపై ఎక్కువ భారం

50 యూనిట్లలోపు వాడేవారు.. మార్చిలో 45, ఏప్రిల్‌‌లో 48, మేలో 60 యూనిట్లు వాడితే జూన్‌‌లో తీసిన రీడింగ్‌‌ 153 యూనిట్లు వచ్చింది. వారికి యావరేజీగా మూడు నెలలకు 51 యూనిట్లకు బిల్లు వేశారు. యావరేజీ చేయడం వల్ల యూనిట్‌‌ చార్జీ రూ.1.45 నుంచి రూ.2.60 కేటగిరిలోకి మారింది. దీంతో 50 యూనిట్లలోపు వాడే వారిపై అదనంగా రూ.111.60 భారం పడినట్లు లెక్కల్లో తేలింది. నెల 100 యూనిట్లు వాడుకునే వారు మార్చిలో 85 యూనిట్లు, ఏప్రిల్‌‌లో 95 యూనిట్లు, మేలో 125 యూనిట్లు వాడితే మూడు నెలలకు కలిపి 303 యూనిట్లు అవుతుంది. యావరేజీ చేస్తే నెలకు 101 యూనిట్లకు బిల్లు వస్తుంది. దీంతో స్లాబ్​ మారిపోయి.. వారిపై అదనంగా రూ.297 భారం పడింది. 200 యూనిట్లలోపు వాడే వారు.. మార్చిలో 185 యూనిట్లు, ఏప్రిల్‌‌లో 195 యూనిట్లు, మేలో 270 యూనిట్లు వాడితే జూన్‌‌లో రీడింగ్‌‌ తీయగా 645 యూనిట్లు అయింది. సరాసరి లెక్క తీస్తే నెలకు 215 యూనిట్లు వచ్చింది. దీంతో కేటగిరీ మారి ఎల్టీ1 బీలోకి మారి యూనిట్‌‌ చార్జీ 200 యూనిట్ల వరకు రూ.5, మిగతా 15 యూనిట్లకు రూ.7.20 పడింది. ఏ నెలకు ఆ నెల బిల్లు తీస్తే వీరికి 200లోపే బిల్లు వచ్చేది. యూనిట్‌‌కు రూ.4.30 పైసలే పడేది. కానీ స్లాబ్​ మారడంతో స్లాబ్‌‌ మారిపోయి రూ.3 వేల అదనపు భారం పడింది.

లాక్​డౌన్​తో డిస్కంలకే లాభం

లాక్‌‌డౌన్‌‌ పీరియడ్‌‌లో అన్ని సంస్థలు నష్టపోగా.. డిస్కంలు మాత్రం భారీగా లాభం పొందుతున్నట్లు సమాచారం. యావరేజీతో మూడు నెలలకు బిల్లులు తీయడంతో రాష్ట్రంలోని 97.60 లక్షల మంది గృహ వినియోగదారుల్లో 50 యూనిట్లలోపు వాడే 20 లక్షల మంది నుంచి రూ.22.20 కోట్లు, 100లోపు వాడే 25 లక్షల మంది నుంచి రూ.74.25 కోట్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు తెలుస్తోంది. 200 యూనిట్లలోపు వాడే వారిపై రూ.486 కోట్ల వరకు అదనంగా భారం పడినట్లు సమాచారం. మిగతా వర్గాలతో కలిపితే రూ.700 కోట్ల వరకూ భారం పడినట్లు తెలుస్తోంది. కిస్తీల రూపంలో తీసుకుంటే అదనంగా 1.50 శాతం వడ్డీతో కలిపి వినియోగదారుల నుంచి మరో వంద కోట్ల వరకు డిస్కంలకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్లాన్​ ప్రకారమేనా?

లాక్​డౌన్​ టైంలో బిల్లులు తీయకపోవడం డిస్కంల ప్లాన్​లో భాగమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో మీటర్‌‌ రీడర్లు రెండు నెలల పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో డిస్కంలకు వచ్చిన ఆదాయాన్ని బేస్‌‌ చేసుకుని వ్యూహాత్మకంగా బిల్లులు తీయలేదని తెలుస్తోంది. 24 గంటలపాటు పని చేస్తున్న కరెంటు సిబ్బంది ఇప్పుడు తీస్తున్నట్లే మీటర్‌‌ రీడింగ్‌‌ తీసి ఉంటే ఇంత భారం పడేది కాదని వినియోగదారులు వాపోతున్నారు. లాక్‌‌డౌన్‌‌తో వాణిజ్య, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు మూతపడడంతో వాటి నుంచి కోల్పోయిన ఆదాయాన్నంతా గృహ వినియోగదారులపై మోపారని విమర్శలు కూడా వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి 4600 మంది రైతులు సూసైడ్