300 ఎకరాలు తగ్గిన గండిపేట రిజర్వాయర్ విస్తీర్ణం

300 ఎకరాలు తగ్గిన గండిపేట రిజర్వాయర్ విస్తీర్ణం


హైదరాబాద్, వెలుగు : గండిపేట్ రిజర్వాయర్ విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గిపోయింది. రెండు శాఖల తప్పుడు నివేదికల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. గండిపేట (ఉస్మాన్​సాగర్​) హిమాయత్​సాగర్​జంట జలాశయాల పరిరక్షణకు సంబంధించిన జీవో నం. 111 అమలులో ఉన్నా కూడా కబ్జాలకు గురవుతోంది. వందేళ్ల చరిత్ర కలిగిన గండిపేట్(ఉస్మాన్ సాగర్) నగరాన్ని వరదల నుంచి కాపాడమే కాకుండా తాగు, సాగు నీటి అవసరాలను తీర్చింది. కాలానుగుణంగా సిటీ అభివృద్ధి చెందుతుంటే దాని పరిధి తగ్గిపోతోంది. 

గ్రేటర్​లోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల పరిరక్షణలో భాగంగా 2019లో హెచ్ఎండీఏ వాటి పూర్తి విస్తీర్ణం తెలుసుకునేందుకు సర్వేకు అదే ఏడాది డిసెంబర్ 30న ప్రిలిమినరీ నోటిషికేషన్​జారీ చేసింది. అయితే గండిపేట్ నిర్వహణ చూసే వాటర్ బోర్డు వద్ద ఉన్న క్యాడస్ట్రల్ మ్యాపులకు, హెచ్ఎండీఏ ఇచ్చిన నోటిఫికేషన్ లోని మ్యాపులకు తేడా ఉంది. అయితే 2014లో పర్యావరణ వేత్తలు ఆర్టీఐ ద్వారా వాటర్ బోర్డు అధికారుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఫుల్ ట్యాంక్ లెవల్ తో కలిపి 6,335.35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.  హెచ్ఎండీఏ నోటిఫికేషన్ లో పుల్ ట్యాంక్ లెవల్ తో కలిపి 6,039 ఎకరాలు మాత్రమేనని చూపింది. రిజర్వాయర్​పరిధి 300 ఎకరాలు తగ్గడంపై అనుమానాలు రావడమే కాకుండా అప్పట్లో దీనిపై పర్యావరణవేత్తలు పెద్ద ఆందోళనే వ్యక్తం చేశారు. ఇదంతా శాఖల మధ్య సమన్వయ లోపం, వ్యాపార, రాజకీయ నేతల ఒత్తిడులతోనే విస్తీర్ణం కోల్పోతుందనే ఆరోపణలు వచ్చాయి.

3.9 టీఎంసీల నీటి సామర్థ్యం 

1908లో వచ్చిన వరదల నుంచి సిటీని కాపాడేందుకు మూసీ నదిపై 3.9 టీఎంసీల నీటి సామర్థ్యంతో గండిపేట రిజర్వాయర్​ నిర్మించారు. 2 కిలోమీటర్ల పొడవైన డ్యామ్ తో లక్ష క్యూసెక్కుల నీటిని ఒకేసారి వదిలేలా15 గేట్లు అమర్చారు.  దాదాపు 738 చదరపు కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతానికి తాగు, సాగునీటికి అందించేలా రూపొందించారు. అయితే రిజర్వాయర్ అడుగున పేరుకుపోయిన సిల్ట్ తో క్రమంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ప్రస్తుతం 2.9 టీఎంసీలు నిల్వ ఉంటుంది. 

ఆక్రమణలకు అడ్డుకట్ట పడట్లే.. 

సిటీ తాగునీటి అవసరాలు తీర్చిన గండిపేట్ కాలక్రమేణ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే మనుగడ కోల్పోతోంది. మూసీకి వచ్చే వరదల నుంచి నగరానికి రక్షణ కల్పించే గండిపేట్, హిమాయత్ సాగర్ జలాశయాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటి పరివాహక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్​ పెరగడంతో  ప్రశ్నార్థకంగా మారింది. జీవో నం. 111 ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నారు. 
– పురుషోత్తంరెడ్డి, పర్యావరణ వేత్త

 ఎంక్వైరీ చేయించాలె

గండిపేట్ చెరువు పరిరక్షణకు చాలాకాలంగా పోరాడుతున్నాం. 2015లోనే చెరువు పూర్తి విస్తీర్ణంపై స్టడీ చేశాం. ఇప్పటి విస్తీర్ణంలో భారీ తేడా ఉండగా చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటీషన్​ వేశాం.  సిటీలో అన్యాక్రాంతమైన చెరువులు, కుంటలపై హైకోర్టు పరిధిలోని ఎన్విరాన్ మెంటల్ బెంచ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పదేళ్ల కిందటే అన్ని రాష్ట్రాల్లో ఎన్విరాన్ మెంటల్ స్పెషల్ బెంచ్ నియమించాలనే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గడంపై సమగ్రమైన విచారణ చేయించాలి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. 
  – లుబ్నా సార్వత్, సోషల్ వర్కర్

ఫైనల్ నోటిఫికేషన్ పెండింగ్​ 

హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ లోనే ఇది తెలియగా, ఇంకా తుది నోటిఫికేషన్ జారీ చేయలేదు. 2019లోనే సర్వే పూర్తవగా,  సర్వే నంబర్లు, ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్​టీఎల్​), బఫర్ జోన్ వంటి వివరాలతో రిపోర్ట్​ ఇవ్వాల్సి ఉండగా పెండింగ్ లోనే ఉంది. హెచ్ఎండీఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో 300 ఎకరాల పరిధి తగ్గడంపై వివాదం మొదలైంది. గండిపేట్ చెరువు పరిధి తగ్గడంపై పలు అనుమానాలు వస్తున్నాయి.