పట్టణ ప్రగతి గ్రాంట్స్ కోసం మున్సిపాలిటీల ఎదురుచూపులు

 పట్టణ ప్రగతి గ్రాంట్స్ కోసం మున్సిపాలిటీల ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: మున్సిపాలిటీల్లోని ఎల్ఈడీ లైట్ల బిల్లుల బాకీ భారీగా పేరుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి నిర్వహణ సంస్థకు ఏడాదిన్నరగా దాదాపు రూ.50 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఎప్పుడు చెల్లిస్తారంటూ సదరు సంస్థ లేఖల మీద లేఖలు రాస్తున్నా ఇటు నుంచి స్పందన లేదు. ఖమ్మం, గ్రేటర్ వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి ప్రధాన పట్టణాల్లో భారీగా బిల్లులు పెడింగ్​లో ఉన్నాయి. కేవలం 10 ప్రధాన పట్ణణాల బాకీ లెక్కిస్తేనే రూ.20 కోట్లు దాటుతోంది. అటు గ్రేటర్ హైదరాబాద్​లోనూ అదే పరిస్థితి. పట్టణ ప్రగతి గ్రాంట్స్ కోసం మున్సిపాలిటీలు కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్నాయి. ఆ గ్రాంట్స్​ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తేనే బిల్లులు చెల్లిస్తామంటున్నాయి. కానీ ఇచ్చే అరకొర గ్రాంట్స్ తో బిల్లులు కట్టడం అసాధ్యమేనని అధికారులు చెబుతున్నారు.

ఈఈఎస్ఎల్ తో ఒప్పందం..

మున్సిపాలిటీల్లో కరెంట్​ను ఆదా చేసేందుకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మున్సిపల్​ శాఖ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఎనర్జీ ఎఫీషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో ఒప్పందం చేసుకుంది. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతోపాటు వాటిని మెయింటెనెన్స్ బాధ్యతల్ని ఈఈఎస్ఎల్ పర్యవేక్షిస్తుంటుంది. గతంలో వచ్చిన కరెంట్​చార్జీల కన్నా.. కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీల ద్వారా ఆదా అయిన దాంట్లో 25 శాతం సదరు సంస్థకు చెల్లించేలా ఎంవోయూ కుదిరింది. ఒక మున్సిపాలిటీలో అంతకుముందున్న బల్బుల కన్నా ఎల్ఈడీల ద్వారా వంద యూనిట్లు మిగిలితే అందులో 25 యూనిట్ల చార్జీని ఈఈఎస్ఎల్ కు చెల్లించాలి. కానీ ఈ ఆదా డబ్బులను ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసిన141 పట్టణాల్లో.. ఏ ఒక్క చోట కూడా ఈఈఎస్ఎల్​కు చెల్లించడం లేదు.

బడ్జెట్ ఉంటే కదా..!

మున్సిపాలిటీలకు జమయ్యే ఆదాయం ఖర్చులకే సరిపోతోంది. అందులో 70 శాతం జీతాలు, కరెంటు బిల్లులు, డీజిల్ బిల్లులకే పోతోంది. ఇక మిగిలిన 30 శాతంతో చిన్న చిన్న పనులు తప్ప పెద్దస్థాయిలో అభివృద్ధి పనులు చేసే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఈడీ బిల్లులు ఎలా కట్టాలని అధికారులు అంటున్నారు. అయితే పట్టణ ప్రగతి గ్రాంట్స్ వచ్చినా పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించే అవకాశం లేదు. ఒక్కో మున్సిపాలిటీకి 10  నుంచి 15 లక్షలు మాత్రమే అందుతాయి. వచ్చే గ్రాంట్స్ ఇలా ఉంటే అంతకు 20 నుంచి 30 రెట్లు ఎక్కువగా ఉన్న బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని మున్సిపల్​ సిబ్బంది చెబుతున్నారు.

ఏడాదిన్నరగా నెట్టుకొస్తూ..

ఏడాదిన్నరగా బాకీ పెరిగిపోవడంతో ఈఈఎస్ఎల్ సంస్థ లేఖలు రాస్తూనే ఉంది. వచ్చిన ఆదాయాన్ని బట్టి వెంటనే బిల్లులు చెల్లించాలని మున్సిపాలిటీలకు మున్సిపల్​ కమిషనర్ అండ్ డైరెక్టర్ కూడా ఆయా పట్టణ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ ఏ మున్సిపాలిటీలోనూ స్పందన లేదు. అలా ఏడాదిన్నర నుంచి పెనాల్టీ  కలుస్తూ వడ్డీలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్ రూ.ఐదు కోట్లకుపైగా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు నల్గొండ, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలు 4 కోట్లకు పైగా,  కామారెడ్డి, కరీంనగర్, మిర్యాలగూడ, ఆర్మూర్, సంగారెడ్డితోపాటు వివిధ చోట్ల రెండు కోట్లకు పైగా, వనపర్తి, భువనగిరి వంటి చిన్న పట్టణాల్లో వరుసగా 86 లక్షలు, 71 లక్షలు చెల్లించాల్సి ఉంది. బిల్లులు చెల్లించాలంటూ ప్రతి నెలా ఇన్వాయిస్ లు వస్తున్నా బాకీలు చెల్లించే మార్గం కనిపించడం లేదని మున్సిపల్​ అధికారులు అంటున్నారు.