రాజస్థాన్​ కాంగ్రెస్​లో ముదురుతున్న సంక్షోభం

రాజస్థాన్​ కాంగ్రెస్​లో ముదురుతున్న సంక్షోభం

రాజస్థాన్ కాంగ్రెస్​లో సంక్షోభం ముదురుతోంది. అశోక్ గెహ్లాట్​నే సీఎంగా ఉంచాలంటూ ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. వాళ్లను బుజ్జగించేందుకు ఆదివారం రాత్రి  జైపూర్ వెళ్లిన పార్టీ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలకు అవమానం ఎదురైంది. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడేందుకు వచ్చిన ఇద్దరు నేతలను ఒక్క ఎమ్మెల్యే కూడా కలవలేదు. దీంతో మాకెన్, ఖర్గే సోమవారం ఢిల్లీకి తిరిగి వచ్చి సోనియాకు పరిస్థితిని వివరించారు. గెహ్లాట్ తోపాటు ఆయన వర్గం ఎమ్మెల్యేల తీరుపై సోనియా గాంధీ సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గెహ్లాట్​కు సన్నిహితుడైన మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్​ను ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఆయన ద్వారా సమస్యలను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. పార్టీ ప్రెసిడెంట్ రేస్ లో గెహ్లాట్ ను కొనసాగిస్తారా? లేదంటే అధిష్టానానికి నమ్మకస్తుడైన మరో నేతను నిలబెడతారా? అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.

జైపూర్/న్యూఢిల్లీ:   రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. అశోక్ గెహ్లాట్​నే రాజస్థాన్ సీఎంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ఆదివారం జైపూర్ వెళ్లిన పార్టీ సీనియర్ నేతలు అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలకు అవమానం ఎదురైంది. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడేందుకు వచ్చిన ఇద్దరు నేతలను ఒక్క ఎమ్మెల్యే కూడా కలవలేదు. చివరకు ఆదివారం రాత్రి గెహ్లాట్ నివాసంలో ఇద్దరు నేతలను గెహ్లాట్ వర్గం నేతలు శాంతి కుమార్​ ధరివాల్, మహేశ్ జోషి, ప్రతాప్ సింగ్ ఖచారియవాస్ మాత్రమే కలిసి తమ డిమాండ్లను చెప్పారు. దీంతో ఎమ్మెల్యేల తీరుతో అవమానానికి గురైన మాకెన్, ఖర్గే సోమవారం ఢిల్లీకి తిరిగి వచ్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి గెహ్లాట్ నామినేషన్ వేయనుండటంతో ఆయననే సీఎంగా కూడా కొనసాగించాలంటూ 92 మంది ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఒకవేళ గెహ్లాట్ స్థానంలో వేరొకరిని సీఎం చేయాల్సి వస్తే.. సచిన్ పైలట్ వర్గంలోని వారికి కాకుండా గెహ్లాట్ వర్గంలోని వ్యక్తికే చాన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తుండటంతో పార్టీ మళ్లీ 
సంక్షోభంలోకి జారుకుంది.   

గెహ్లాట్ వర్గంపై మాకెన్ ఫైర్ 

అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు క్రమశిక్షణ తప్పుతున్నారని రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ అజయ్ మాకెన్ మండిపడ్డారు. కొత్త సీఎం ఎంపికపై పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాతే తీర్మానం చేయాలని డిమాండ్ చేయడమేంటని ఫైర్ అయ్యారు. సోమవారం ఢిల్లీకి బయలుదేరే ముందు జైపూర్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ చరిత్రలోనే షరతులు పెట్టి తీర్మానం చేయాలన్న డిమాండ్ ఎన్నడూ రాలేదు. రిసొల్యూషన్ ఎప్పుడూ ఏక వాక్యంగానే ఉంటుంది. పార్టీ ప్రెసిడెంట్​కు అన్ని విషయాలు చెప్పిన తర్వాత ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు. కానీ గెహ్లాట్ ఇప్పుడే పార్టీ ప్రెసిడెంట్ అయినట్లుగా భావిస్తూ షరతులు పెట్టి తీర్మానం చేయాలనడం కరెక్ట్ కాదు” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటినీ పార్టీ చీఫ్ సోనియాకు వివరిస్తామని చెప్పారు. 

పార్టీ చీఫ్ నిర్ణయంపై సందిగ్ధం 

రాజస్థాన్ కాంగ్రెస్​లో తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ చీఫ్ ​ సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ ప్రెసిడెంట్ రేస్​లో గెహ్లాట్​ను కొనసాగిస్తారా? లేదంటే హైకమాండ్​కు నమ్మకస్తుడైన మరో నేతను నిలబెడతారా? అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే, పార్టీ ఎన్నికలు అంతర్గత వ్యవహారమని, తాను సీఎం పోస్టును వదులుకోవాల్సిన అవసరంలేదని, ‘వన్ మ్యాన్, వన్ పోస్ట్’ ఫార్ములా వర్తించదని గెహ్లాట్ చెప్తున్నారు. 

పంజాబ్ లెక్కనే అయితం: శాంతి ధరివాల్ 

సీఎం పదవి నుంచి గెహ్లాట్​ను తప్పిస్తే పంజాబ్ లో మాదిరిగానే రాజస్థాన్​లోనూ కాంగ్రెస్​కు నష్టం తప్పదని గెహ్లాట్ వర్గం మంత్రి శాంతి కుమార్ ధరివాల్ అన్నారు. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలతో తన ఇంట్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పంజాబ్​లో సీఎం పదవి నుంచి అమరీందర్ సింగ్​ను దింపిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.