పన్ను కట్టలేదని తలుపులు తీసుకుపోయిన్రు

పన్ను కట్టలేదని తలుపులు తీసుకుపోయిన్రు
  • పీర్జాదిగూడ కార్పొరేషన్​అధికారుల నిర్వాకం

మేడిపల్లి, వెలుగు: పన్ను కట్టలేదని పీర్జాదిగూడ కార్పొరేషన్ సిబ్బంది ఓ ఇంటి తలుపులు ఊడబీక్కుని పోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్12వ డివిజన్​లోని మురళీ రెసిడెన్షియల్​కు సంబంధించి ఓనర్​ ఆరేండ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్​కట్టట్లేదు. మంగళవారం బిల్డింగ్​వద్దకు వెళ్లిన కార్పొరేషన్​అధికారులు కిరాయికి ఉంటున్న అస్లాం పాషా అనే వ్యక్తి ఇంటి తలుపులు ఊడబీకి ఎత్తుకెళ్లారు. ఇదేంటని అడిగిన బాధితుడిని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరించారు.

తలుపులతోపాటు ఇంట్లోని టీవీ, సోఫా సెట్ ఎత్తుకెళ్లారు. బాధితుడు మీడియాను ఆశ్రయించ డంతో వెనక్కి తగ్గిన కార్పొరేషన్ సిబ్బంది సామాన్లను తిరిగి ఇచ్చారు. కార్పొరేషన్ సిబ్బంది చేసిన పని తప్పేనని వారిపై చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ కమిషర్ రామకృష్ణారావు అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా  చూసుకుంటామన్నారు. ఎప్పట్లాగే ప్రాపర్టీ ట్యాక్సు వసూలు చేయాలని సిబ్బందికి సూచనలు చేశామే తప్ప  ఇండ్లల్లో చొరబడమని చెప్పలేదన్నారు.