బీటెక్​ స్టూడెంట్ లావణ్య ఆత్మహత్యకు సర్కారే కారణం

బీటెక్​ స్టూడెంట్ లావణ్య ఆత్మహత్యకు సర్కారే కారణం
  • బీటెక్​ స్టూడెంట్​ మృతిపై ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల మండిపాటు
  • వనపర్తి జిల్లా ఆస్పత్రి ముందు ఆందోళన 
  • బీజేపీ నేత బంగారు శ్రుతిని తిట్టిన మున్సిపల్​ చైర్మన్​
  • కేసు పెడతానని హెచ్చరించిన శ్రుతి

వనపర్తి, వెలుగు: దళిత బీటెక్​ స్టూడెంట్​ లావణ్య ఆత్మహత్యకు సర్కారు తీరే కారణమని ప్రతిపక్షాలు, స్టూడెంట్​, నిరుద్యోగ సంఘాలు మండిపడ్డాయి. మంగళవారం వనపర్తి జిల్లా ఆస్పత్రిలో లావణ్య మృతదేహానికి పోస్ట్​మార్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్​, టీడీపీ, వైఎస్సార్‌‌టీపీ, వివిధ స్టూడెంట్​ సంఘాలు కలిసి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగాయి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నేతలు నిరసన చేపట్టారు. సర్కారు ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వకపోవడం వల్లే లావణ్య ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లావణ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆమె కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడంతో పాటు టైంకు స్టూడెంట్లకు స్కాలర్​షిప్పులు, ఫీజు రీయింబర్స్​మెంట్లు ఇవ్వాలన్నారు. లావణ్య మృతదేహాన్ని మార్చురీ నుంచి బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యువజన కాంగ్రెస్​ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి లావణ్య మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 

బంగారు శృతిని తిట్టిన మున్సిపల్​ చైర్మన్​
బీజేపీ రాష్ట్ర జనరల్​ సెక్రటరీ బంగారు శృతిని వనపర్తి మున్సిపల్​ చైర్మన్​ గట్టు యాదవ్​, వైస్​ చైర్మన్​ వాకిటి శ్రీధర్​లు తిట్టారు. ఓ స్టూడెంట్​ చనిపోతే మంత్రి పేరిట చైర్మన్​ కేవలం రూ.5 వేల సాయమే చేయడమేంటని ఆమె ప్రశ్నించడంతో.. వారిద్దరు తిట్ల దండకం అందుకున్నారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దళితులు, మహిళలపై సీఎం కేసీఆర్​, టీఆర్​ఎస్​ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు. దళితులకు సీఎం మొండి చెయ్యి చూపించడం వల్లే లావణ్య కుటుంబం అప్పులపాలైందని విమర్శించారు. కూతురు చదువుకు ఫీజు కట్టలేని స్థితిలో ఆ కుటుంబం ఉందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్​ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్​ ఇవ్వలేదన్నారు. చదువుకున్నా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కోల్పోయే లావణ్య ప్రాణాలు తీసుకుందన్నారు. స్టూడెంట్లకు సర్కార్​ స్కాలర్​షిప్పులు, ఫీజు రీయింబర్స్​మెంట్లు చెల్లించడం లేదన్నారు.