ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెలుగు నెట్​వర్క్ : ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ వన్ ఎగ్జామ్ కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆఫీసర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు దీనిపై రివ్యూ నిర్వహించారు. పోలీసులు, తహసీల్దార్లు, లైజనింగ్‍ ఆఫీసర్లు, ఎగ్జామినేషన్‍ చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విధి విధానాలు తెలియజేశారు. అభ్యర్థులకు సరిపడా సెంటర్లు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ గైడ్ లైన్స్ అమలు చేయాలని ఆదేశించారు. ఒక టేబుల్‍పై ఒక్కరే కూర్చునేలా చూడాలని సూచించారు. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అభ్యర్థుల సందేహాలను క్లియర్‍ చేయడానికి టోల్‍ ఫ్రీ, హెల్ప్ లైన్ నంబర్లు  180042 53424(వరంగల్),18004250520(ములుగు), 9030632608(భూపాలపల్లి) ఏర్పాటు చేశారు.

చింతగట్టులో హనుమకొండ ఆర్టీఏ ఆఫీస్

21 నుంచి సేవలు ప్రారంభించే చాన్స్

హనుమకొండ, వెలుగు: ఈ నెల 21 నుంచి హనుమకొండ జిల్లా ఆర్టీఏ ఆఫీస్ చింతగట్టులో నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్–-ఖమ్మం మార్గంలోని రంగశాయిపేట సమీపంలో నిర్వహిస్తున్న హనుమకొండ ఆర్టీఏ ఆఫీస్ ను చింతగట్టు క్యాంప్​కు షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ ఇరిగేషన్ ఆఫీస్​పక్కనే ఉన్న బిల్డింగ్​ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇదివరకు ఉమ్మడి జిల్లాకు చెందిన కార్యకలాపాలన్నీ వరంగల్​నుంచే కొనసాగగా..  జిల్లాల విభజన తర్వాత జనగామ, మహబూబాబాద్​జిల్లాల్లో  సెపరేట్​గా ఆఫీసులు ఏర్పాటు చేశారు. ములుగు, జయశంకర్​ జిల్లాల ఆఫీస్​ను భూపాలపల్లిలో నిర్వహిస్తున్నారు. కాగా హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆఫీస్​లు మాత్రం రంగశాయిపేటలోని బిల్డింగ్​లోనే  కొనసాగుతూ వచ్చాయి.

ఇప్పుడు హనుమకొండ జిల్లా ఆర్టీఏ ఆఫీస్​ను సెపరేట్ గా చింతగట్టులో ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో పదిరోజుల్లోగా ఆర్టీఏ ఆఫీస్​ను షిఫ్ట్​ చేసి ఈ నెల 21న చింతగట్టులో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆఫీస్​లో ఉన్న డాక్యుమెంట్స్, టేబుల్స్​, ఇతర సామగ్రి తరలింపు ప్రక్రియ మొదలుపెట్టారు. కాగా  ఆర్టీఏ ఆఫీస్​ షిఫ్ట్​ అవుతున్న నేపథ్యంలో దరఖాస్తులు 21వ తేదీ నుంచి హనుమకొండ జిల్లాకు చెందిన దరఖాస్తుదారులు చింతగట్టుకే వెళ్లాల్సి ఉంటుందని డిప్యూటీ ట్రాన్స్​ పోర్ట్ కమిషనర్​ పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రంగశాయిపేటలోని వరంగల్ ఆర్టీఏ ఆఫీస్​వద్ద ప్రజలకు అవగాహన కలిగేలా ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. 

లైసెన్స్​ లేని షాపులపై టాస్క్​ఫోర్స్ కొరడా

కాజీపేట, వెలుగు : ఫుడ్ లైసెన్స్, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా బిజినెస్ చేస్తున్న షాపులపై టాస్క్ ఫోర్స్ కొరడా ఝులిపించింది. బుధవారం నగరంలో తనిఖీలు జరిపి అల్లం పేస్ట్, ఐస్​క్రీం తయారు చేస్తున్న ఇద్దరు వ్యాపారులను పట్టుకున్నారు. వరంగల్ దేశాయిపేటకు చెందిన ఈ సత్యనారాయణ ఎటువంటి లైసెన్స్ లేకుండా దయానంద్ ఐస్​క్రీం షాప్ పేరుతో ఐస్​క్రీం లు తయారుచేస్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకొని రూ.1.21లక్షల విలువ చేసే ఐస్​క్రీంలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన బికిష్ అబువాని అనే మహిళ ‘స్టార్ అల్లం వెల్లుల్లి పేస్ట్’ పేరుతో పర్మిషన్ లేని షాప్ పెట్టగా ఆమెను అదుపులోకి తీసుకొని రూ.67వేల అల్లం డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎం.జితేందర్ రెడ్డి, సీఐలు వి.నరేష్ కుమార్, ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్సై లవణ్ కుమార్, సిబ్బందిని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్​ గైక్వాడ్ అభినందించారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

రాయపర్తి, వెలుగు : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ సీనియర్ లీడర్ తాళ్లపల్లి నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందగా.. బాధిత కుటుంబాన్ని బుధవారం ఎంపీ పసునూరి దయాకర్ పరామర్శించారు. నర్సయ్య మృతదేహానికి నివాళి అర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. నర్సయ్య ఉద్యమ సమయం నుంచే టీఆర్ఎస్ లో ఉండి పార్టీకి ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సతీమణి ఉషారాణి సైతం కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్​, టీఆర్ఎస్​ మండలాధ్యక్షుడు మునావత్ నరసింహానాయక్ తదితరులున్నారు.

ఆర్థిక సాయం అందజేత..

పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఇటీవల మృతి చెందిన జున్ను అరుణ, మాసాని శ్రీనివాస్, మాసాని యాకమ్మ, భూక్య కేస్లీ, గడ్డం లక్ష్మి, ధోని సమ్మయ్య కుటుంబ సభ్యులను కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్​రావు పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసున్నారు, కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బొక్కల ప్రమోద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉడుతల కృష్ణ, నాయకులు భాస్కర్,  భిక్షపతి,  శ్రీనివాస్, భాస్కర్, మదార్, సాంబయ్య, సుధాకర్, సంపత్,  కుమార్,  రమేష్,  రాజు తదితరులు పాల్గొన్నారు.

వ్యర్థాల నిర్వహణకు ఆర్ఆర్ఆర్ క్యాంపెయిన్

వరంగల్​సిటీ, వెలుగు : స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా వరంగల్ బల్దియాలో ప్రత్యేక ప్రోగ్రాం చేపట్టారు. ‘2.0 కియోస్క్’ పేరుతో వ్యర్థాల రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్(ఆర్ఆర్ఆర్) అనే కార్యక్రమాన్ని బుధవారం కమిషనర్ ప్రావీణ్య ప్రారంభించారు.  మెప్మా, బల్దియా సంయుక్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో వేరుచేసిన వ్యర్థాలపై దృష్టి సారించి.. ‘ఆర్ఆర్ఆర్’ అనే కాన్సెప్ట్ ను అమలు చేస్తామన్నారు. వివిధ ఆఫీసుల నుంచి  ప్రత్యేక డబ్బాల్లో వ్యర్థాలను సేకరిస్తామన్నారు. వరంగల్​ను క్లీన్ సిటీగా మార్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

పనులు సకాలంలో పూర్తి చేయండి

వరంగల్ సిటీలో సాగుతున్న అభివృద్ధి పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని కమిషనర్ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం పలు డివిజన్లలో చేపట్టిన పనుల్ని పరిశీలించారు. ఉర్స్ రోడ్ లోని శ్మశాన వాటిక, కరీమాబాద్ లోని కమ్యూనిటీ హాల్, వినాయక్ కాలనీ, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని టౌన్ పార్క్​లను తనిఖీ చేశారు. దూపకుంట, స్తంభంపల్లి, ఖిలావరంగల్ ప్రాంతాల్లో నిర్మించిన సీసీ, బీటీ రోడ్లను చెక్ చేశారు. నాణ్యత లేకుంటే బిల్లుల్లో కోత విధిస్తామని   కాంట్రాక్టర్లను
హెచ్చరించారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రత పాటించాలి

పర్వతగిరి(సంగెం), వెలుగు : పీహెచ్ సీలు, సీహెచ్​సీల్లో పరిశుభ్రత పాటించాలని డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్​ ఆఫీసర్ డా.ప్రకాశ్​కోరారు. బుధవారం వరంగల్ జిల్లా సంగెం పీహెచ్ సీలో నిర్వహించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఆసుపత్రుల వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. తద్వారా వ్యాధుల బారిన  పడకుండా ఉంటారని సూచించారు.

పేదలకు నిత్యావసరాలు అందించాలి

ఎల్కతుర్తి, వెలుగు : పేద ప్రజలకు రేషన్ షాప్ ల ద్వారా నిత్యావసరాలు అందేలా చూడాలని ఎంపీపీ మేకల స్వప్న సూచించారు. ఈ నెల16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్కతుర్తిలో ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, నూనె, పప్పులు, గుడ్లు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. అనంతరం వ్యాస రచన పోటీల్లో రాణించిన స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గుజ్జుల రవీందర్​రెడ్డి, ఎంపీడీవో సునీత, ఎంఈవో రవీందర్ తదితరులున్నారు.

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి

మహేశ్వరంలో విషాదం

నర్సంపేట, వెలుగు: వేర్వేరు కారణాలతో ఒకే గ్రామానికి  చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరమళ్ల దివ్య–మధు దంపతుల ఒక్కగానొక్క కొడుకు మన్విష్ రెడ్డి(7) ఓ ప్రైవేట్ స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. పండుగ నేపథ్యంలో అమ్మమ్మ ఊరు అయిన ముత్తోజిపేటకు వెళ్లగా.. అక్కడ పాము కరిచింది. నర్సంపేటలో చికిత్స పొందగా, హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్​కు తరలించారు. పరిస్థితి చేజారి బుధవారం బాలుడు చనిపోయాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అలాగే గ్రామానికి చెందిన మాడ్గుల జ్యోతి(40) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో గుండెపోటుకు గురై చనిపోయింది. సాధారణ వయసులోనే గుండెపోటు రావడంతో కుటుంబసభ్యుల రోదన అందరినీ కలచివేసింది.

ఉద్యోగాల పేరిట రూ.1.20కోట్ల వసూల్​!

పోలీసుల అదుపులో ఔట్ సోర్సింగ్ సూపర్ వైజర్ ?

మహబూబాబాద్​అర్బన్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఉద్యోగాల పేరిట ఓ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి రూ.1.20కోట్లు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కురవి మండలానికి చెందిన ఓ వ్యక్తి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. గతంలో ఈ హాస్పిటల్ ​ఏరియా ఆసుపత్రిగా ఉండగా.. ఇటీవలే జిల్లా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ అయింది. దీనికి తోడు మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. దీంతో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగుల అవసరం ఏర్పడింది.

ఈ క్రమంలో సదరు సూపర్ వైజర్.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేశాడు. సూపర్​వైజర్, పేషేంట్​కేర్, స్లీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాలు అమ్మకానికి పెట్టాడు. మొత్తం 40మంది వద్ద రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.