బల్క్ యూజర్లకు అమ్మే డీజిల్​ ధరలు పెరిగినయ్​​

బల్క్ యూజర్లకు అమ్మే డీజిల్​ ధరలు పెరిగినయ్​​

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దాదాపు 40 శాతం పెరగడంతో బల్క్ యూజర్లకు అమ్మే డీజిల్ ధర లీటరుకు రూ. 25 చొప్పున పెంచామని ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు (ఏఎంసీలు) ప్రకటించాయి. సాధారణ పెట్రోల్ పంపుల్లో అమ్మే రేట్లు మారలేదు.   బస్ ఫ్లీట్ ఆపరేటర్లు,  మాల్స్ , ఎయిర్​పోర్టుల వంటి బల్క్ యూజర్లు చమురు కంపెనీల నుండి నేరుగా ఆర్డర్ చేయడానికి పెట్రోల్ బంక్‌‌‌‌‌‌‌‌‌‌ల వద్ద క్యూలు కట్టడంతో ఈ నెలలో పెట్రోల్ పంపుల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీంతో నయారా ఎనర్జీ, జియో-బిపి , షెల్ వంటి ప్రైవేట్ రిటైలర్లు బాగా నష్టపోతున్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ప్రభుత్వ కంపెనీలు ధరలను పెంచలేదు. ఇంత తక్కువ ధరలకు ప్రైవేటు కంపెనీలు అమ్మలేకపోతున్నాయి. నష్టాలకు అమ్మడానికి బదులు పంపులను మూసివేస్తామని చెబుతున్నాయి.2008లో ఇలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వ ఏఎంసీల మాదిరిగా సబ్సిడీ ధరలకు అమ్మలేక 1,432 పెట్రోల్ పంపులలను మూసివేసింది.బల్క్ యూజర్లు పెట్రోల్ పంపులవైపు చూస్తుండటంతో ఇదే పరిస్థితి మళ్లీ ఏర్పడవచ్చని అంటున్నారు. తాజా పెంపు కారణంగా బల్క్ యూజర్లకు అమ్మే డీజిల్ ధర ముంబైలో లీటరుకు రూ.122.05కు పెరిగింది. పెట్రోల్ పంపులో ధర రూ.94.14 మాత్రమే. ఢిల్లీలో బంకుల్లో లీటర్ డీజిల్ ధర రూ. 86.67 కాగా బల్క్/ ఇండస్ట్రియల్ యూజర్లు మాత్రం రూ.115 చొప్పున చెల్లించాలి. ప్రపంచవ్యాప్తంగా చమురు  ఇంధన ధరలు పెరిగినప్పటికీ ఏఎంసీలు నవంబర్ 4, 2021 నుండి పెట్రోల్  డీజిల్, రిటైల్ ధరలను పెంచలేదు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు సమావేశాలే ఇందుకు కారణమని అంటున్నారు. నయారా ఎనర్జీ, జియో-బిపి,  షెల్ వంటి ప్రైవేట్ ఇంధన రిటైలర్లు ..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసి) కంటే ఎక్కువ ధరలకు ఫ్యూయల్​ను అమ్మితే కస్టమర్లను కోల్పోయే అవకాశం ఉన్నందున పాత ధరలనే కొనసాగిస్తున్నాయి.