జీపీ కార్మికుల జీతాలు పెంచాలి

జీపీ కార్మికుల జీతాలు పెంచాలి

ముషీరాబాద్, వెలుగు : జీపీ కార్మికులకు కనీస వేతనంతో పాటు వారి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్​ చేసింది. లేకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. గత ప్రభుత్వాలు కూడా సమస్యలు పరిష్కరించకుండా మోసం చేశాయని, ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలని, పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలని, మల్టీపర్పస్​ విధానం రద్దు చేయాలనే తదితర డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో 12వ తేదీన మొదలైన 350 కి.మీ పాదయాత్ర మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్​ దాకా ర్యాలీ నిర్వహించారు. సభకు చీఫ్ గెస్ట్​గా హాజరైన సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబా మాట్లాడారు. జీపీ కార్మికులను విస్మరించిన పాలకులకు ఏ విధంగా బుద్ధి చెప్పారో.. అదేవిధంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. 

కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నది..

కార్మికులకు నామమాత్రంగా వేతనాలు ఇస్తూ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. కార్మికులను పర్మినెంట్ చేసి.. వేతనాలు పెంచాలని డిమాండ్​ చేశారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్​ కోడ్​లు తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. ఈ కోడ్​తో జీపీ కార్మికులకు, సిబ్బందికి కార్మిక చట్టాలు వర్తించకుండా కుట్రలు పన్నిందని ఆరోపించారు. బహిరంగ సభలో యూనియన్ గౌరవ అధ్యక్షులు గ్యార పాండు, వెంకటయ్య, గణపతి రెడ్డి, తునికి మహేశ్, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.