కదం తొక్కిన చెరుకు రైతులు

కదం తొక్కిన చెరుకు రైతులు
  • మూతబడ్డ సర్కారు చక్కెర ఫ్యాక్టరీలు
  • ప్రైవేటువి తెరుసుడెప్పుడో, మూసుడెప్పుడో క్లారిటీ లేదు
  • ఫ్యాక్టరీలు తెరిపిస్తామని వదిలేసిన సర్కారు
  • ఏటా పంటలేసి మునుగుతున్న రైతులు 
  •  జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంద్ సక్సెస్  
  •   సర్కారు, ట్రైడెంట్​ ఫ్యాక్టరీ తీరుపై నిరసన


ప్రభుత్వ వైఖరి, చెరుకు క్రషింగ్​ను ఆపేసిన ట్రైడెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుకు నిరసనగా జహీరాబాద్​లో రైతులు కదం తొక్కారు. బుధవారం చేపట్టిన బంద్​లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఫ్యాక్టరీలో క్రషింగ్​ స్టార్ట్​ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. జహీరాబాద్ ఏరియాలో దాదాపు 20 వేల ఎకరాల్లో చెరుకు సాగవుతోంది. ట్రైడెంట్  ఫ్యాక్టరీలో రెండేండ్లుగా క్రషింగ్ చేయట్లే దు. దీంతో చెరుకును ఎక్కడ అమ్మాలో తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

వెలుగు నెట్​వర్క్: ఒకప్పుడు ఆసియాలోనే పెద్ద చక్కెర ఫ్యాక్టరీ ఉందని చెప్పుకున్న రాష్ట్రంలో ఇప్పుడు చెరుకు రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. సర్కారు ఫ్యాక్టరీలు మూతపడటం, ప్రైవేటువి తెరవడం, మూయడం చేస్తుండటంతో ఆగమైతున్నారు. ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తుండటంతో ఏటా పంటలు పండిస్తున్న రైతులు.. తీరా క్రషింగ్​ టైమ్​కు ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో పక్క రాష్ట్రాలకు చెరుకు తరలించి ట్రాన్స్​పోర్ట్​ చార్జీల రూపంలో రూ. వేలల్లో నష్టపోతున్నారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చక ఏటా నిండా మునిగి రోడ్డెక్కుతున్నారు. తాజాగా బుధవారం జహీరాబాద్​ రైతులు బంద్​ నిర్వహించి నిరసన తెలిపారు.
అమలుకాని 100 రోజుల హామీ 
రాష్ట్రంలో 8 షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. వీటిల్లో బోధన్, ముంబోజిపల్లి, ముత్యంపేటల్లోని నిజామ్ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలు ఇప్పటికే బందయ్యాయి. ప్రస్తుతం సంగారెడ్డిలో గణపతి, జహీరాబాద్ ట్రైడెంట్, కామారెడ్డి గాయత్రి, పిట్లం మాగి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలున్నాయి. చక్కెర ఇండస్ట్రీకి సంబంధించి టీఆర్ఎస్ గవర్నమెంట్ మొదటి నుంచీ రైతులను మభ్యపెడుతోంది. తాము ఆధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్స్​ను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ రంగంలోనే నడుపుతామని సీఎం కేసీఆర్ 2014 ఎన్నికల టైమ్​లో ప్రకటించారు. ఆ తర్వాత రైతులే ముందుకొచ్చి నడుపుకుంటే ప్రభుత్వపరంగా సాయం చేస్తామన్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు రైతులకు బకాయి పడిన బిల్లులను ఇన్​టైమ్​లో ఇప్పించడంలోనూ, మూతపడిన ప్రైవేట్ మిల్లులను తెరిపించడంలోనూ సర్కారు చొరవ చూపించట్లేదు. నిజాం షుగర్స్ కింద బోధన్, జగిత్యాల జిల్లా  ముత్యంపేట, మెదక్ జిల్లా ముంబోజీపల్లిలో యూనిట్లు నిర్వహించారు. బోధన్​లో 25 వేల ఎకరాల్లో, ముత్యంపేట ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల్లో, ముంబోజీపల్లి పరిధిలో దాదాపు 12 వేల ఎకరాల్లో చెరుకు సాగయ్యేది. బోధన్, ముంబోజిపల్లి, మల్లాపూర్ ఫ్యాక్టరీలు 2015లో మూతపడ్డాయి. వీటిని తిరిగి తెరిస్తే దాదాపు 60 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేయొచ్చు. 
క్రషింగ్ ఏర్పాట్లు స్టార్ట్​ కాలె 
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు (బి)లోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఏడాదిన్నర కింద మూతపడింది. 2019–20 సీజన్ తర్వాత ఫ్యాక్టరీని మూసేసింది. ఆ ఏడాది లేట్​ క్రషింగ్ స్టార్ట్​ చేసి సీజన్ లో 1.11 లక్షల టన్నుల చెరుకును గానుగాడించింది. ఈ సీజన్​లో ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ. 12.69 కోట్లు బాకీ పడింది. బకాయిలు ఎంతకూ చెల్లించకపోవడంతో జిల్లా యంత్రాంగం ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. దీంతో ఏడాదిన్నర తర్వాత కంపెనీ బకాయిలు కట్టింది. ఈ సీజన్​లో ఫ్యాక్టరీని నడిపించాలంటే ఇప్పటినుంచే మిషనరీని రెడీ చేయాల్సి ఉండగా ఇంకా ఏ పనులూ స్టార్ట్​ కాలేదు. ఈసారి 10 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని సీడీసీ అంచనా వేసింది.  ఇప్పటికైనా క్రషింగ్ జరిగేలా చొరవ తీసుకోవాలని.. చెరుకును కర్నాటక, మహారాష్ట్రకు తరలిస్తే ట్రాన్స్​పోర్ట్​ చార్జీల భారం పడుతుందని రైతులు వాపోతున్నారు.
పేరుకుపోయిన బకాయిలు
పోయినేడు నవంబర్ నుంచి దాదాపు 9లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ అయింది. మొత్తం రూ.259 కోట్లకు గాను రైతులకు రూ.133 కోట్లే చెల్లించాయి. ఇంకా రూ.126 కోట్ల బకాయిలు ఉన్నాయి. చెరుకు ఇచ్చిన 15 రోజుల్లోనే బిల్లులు చెల్లించాల్సిన యాజమాన్యాలు సాకులతో డబ్బులివ్వకపోవడంతో బకాయిలు పెరుగుతున్నాయి. రాష్ట్రప్రభుత్వమూ బకాయిలు 
ఇప్పించడంలో శ్రద్ధ పెట్టట్లేదు. దీంతో రైతులు ప్రతిసారీ రోడ్డెక్కాల్సి వస్తోంది.
ఇథనాల్ తయారీతో లాభాలు 
చక్కెర తయారీ వల్ల గిట్టుబాటు కాక మిల్లులను మూసేస్తున్నట్టు యాజమాన్యాలు చెప్తుండటంతో రైతులు, షుగర్ ఫ్యాక్టరీలు నష్టాలబారిన పడకుండా చక్కెరతో పాటు ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ప్రతిపాదన తెచ్చింది. చక్కెర మిల్లులు ఇథనాయిల్​ తయారు చేస్తే గ్రేడుల వారీగా లీటరుకు  రూ. 62.65, రూ. 57.61, రూ. 45.69 చొప్పున ఆయిల్ కంపెనీలు కొనేలా ఆదేశించింది. దీనివల్ల చెరుకుకు ధర వస్తుందని, ఫ్యాక్టరీలు నడుస్తాయని చెప్పింది. కానీ ఈ దిశగా రాష్ట్ర సర్కారు చొరవ చూపట్లేదని విమర్శలు వస్తున్నాయి. 

కదం తొక్కిన చెరుకు రైతులు
  
జహీరాబాద్, వెలుగు:
ప్రభుత్వ వైఖరి, చెరుకు క్రషింగ్​ను ఆపేసిన ట్రైడెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీరుకు నిరసనగా జహీరాబాద్​ పట్టణంలో రైతులు కదం తొక్కారు. బుధవారం పట్టణంలో చేపట్టిన బంద్​లో ఫ్యాక్టరీ జోన్ పరిధిలోని గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు ప్రకటించాయి. జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ ర్యాలీ చేపట్టిన రైతులు.. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఫ్యాక్టరీలో క్రషింగ్​ స్టార్ట్​ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ వేరే ప్రాంతానికి చెరుకు తరలిస్తే ఖర్చులను ప్రభుత్వం భరించాలని అన్నారు.
రెండేళ్లుగా క్రషింగ్​ ఆగడంతో..
జహీరాబాద్ ఏరియాలో దాదాపు 20 వేల ఎకరాల్లో 10 లక్షల టన్నుల చెరుకు సాగు చేస్తున్నారు. అయితే ట్రైడెంట్ షుగర్​ ఫ్యాక్టరీలో రెండేళ్లుగా క్రషింగ్  చేయట్లేదు. దీంతో చెరుకును ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను మంత్రులు, అధికారులకు అనేకసార్లు విన్నవించినా పరిష్కారం కాలేదు. ఇటీవల ట్రైడెంట్ యాజమాన్యంతో మంత్రి హరీశ్​ రావు మాట్లాడి ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించాలని సూచించారు. ‘నవంబర్ నెలలో చెరుకు పంట కోతకు వస్తుంది. ట్రైడెంట్​లో క్రషింగ్ చేయాలంటే 2 నెలల ముందు నుంచే ఫ్యాక్టరీలోని బాయిలర్​లో మంటలు వేయాలి.  మెషీన్లలో లోటుపాట్లు సరిచేయాలి.  కానీ ఆ పనులు జరగట్లేదు. దీంతో క్రషింగ్ చేస్తారనే నమ్మకం పోయింది’ అని రైతుల చెప్పారు.