కేంద్రానికి రా రైస్​ 40 లక్షల టన్నులు ఇస్తం

కేంద్రానికి రా రైస్​ 40 లక్షల టన్నులు ఇస్తం
  • రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు
  • అవసరాలకు తగ్గట్టు ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తం
  • 45 రోజులు లేట్​చేసి ఇప్పుడు అభ్యర్థన
  • 65లక్షల టన్నుల ధాన్యం సెంటర్లకు వచ్చుడు డౌటే!

హైదరాబాద్‌‌, వెలుగు:నలభై లక్షల టన్నుల రా రైస్​ను ఇస్తామని  కేంద్రానికి  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలను పంపింది.  మొన్నటి దాకా బాయిల్డ్ రైస్ కొనాలంటూ డిమాండ్ చేసిన రాష్ట్ర సర్కార్.. రా రైస్, ఫోర్టిఫైడ్​ రైస్​ ఇస్తామని తెలిపింది. ధర్నాలు, ఆందోళనలతో కొనుగోళ్లు 45 రోజులు లేటు చేసిన సర్కార్ చివరకు కేంద్రంతో చేసుకున్న అగ్రిమెంట్​కే ఓకే చెప్పింది. ఈ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సివిల్‌‌ సప్లయ్స్‌‌ వర్గాలు అంటున్నాయి.

కొనుగోళ్లు ఆలస్యం చేయడంతో వడ్ల సేకరణ కేంద్రాలకు 65లక్షల టన్నుల ధాన్యం వస్తుందా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మిల్లర్లు 10లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. మరో ఐదు లక్షల టన్నులు ప్రైవేటు వ్యాపారులకు, ఇంకో ఏడు లక్షల ధాన్యం అవసరాలకు పోతుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం 40లక్షల టన్నుల ధాన్యం మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మిల్లింగ్‌‌‌‌తో నష్టం అంచనాలు ఇలా..

ధాన్యం సేకరించి మిల్లింగ్‌‌‌‌ చేసి రారైస్‌‌‌‌గా ఇస్తే ఎంత నష్టం వస్తుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన అంచనాలు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీని వేసి క్వింటాల్‌‌‌‌ ధాన్యం మిల్లింగ్‌‌‌‌ చేస్తే ఎన్ని నూకలు వస్తాయి. ఎన్ని బియ్యం వస్తాయనేది నిజనిర్ధారణ చేయనుంది. ఇప్పటి వరకు క్వింటాల్​కు 67 కిలోలు ఇవ్వాలనే ఎఫ్‌‌‌‌సీఐ రూల్స్ ఉన్నాయి. ఇందులో 50 కిలోలు బియ్యం, 17 కిలోల నూకలకు ఎఫ్‌‌‌‌సీఐ అనుమతిస్తుంది. కానీ యాసంగి ధాన్యంలో వచ్చే నూక శాతం రెట్టింపు కానుంది. దీంతో బియ్యం 33 కిలోల నుంచి 34 కిలోలు అవతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ పెరిగిన నూక శాతంతో 17 కిలోల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే 40 లక్షల ధాన్యం వచ్చినా.. కిలోకు రూ.32 చొప్పున 17 కిలోలకు వచ్చే నష్టం మొత్తం రూ.2,176 కోట్లు ఉంటుందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నరు. 17 కిలోల నూకలను మార్కెట్‌‌‌‌ అమ్ముకుంటే రూ.700 కోట్ల వరకు ఆదాయం రానుంది. అయితే యాసంగి సీజన్‌‌‌‌ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,500 కోట్లకు మించి నష్టం రాదని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ అంటున్నరు.

దిగొచ్చిన రాష్ట్ర సర్కారు

ఫిబ్రవరి నెల 25వ తేదీన కేంద్రంతో జరిగిన సమావేశంలోనే రా రైస్​ ఇస్తామని చెప్పి ఉంటే వడ్లు అమ్ముకోవడంలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చేది కాదు. అప్పుడు బాయిల్డ్ రైస్‌‌ మాత్రమే ఇస్తామని, రారైస్‌‌ ఇవ్వలేమని, ఫోర్టిఫైడ్‌‌ సాధ్యం కాదని రాష్ట్ర సర్కారు చెప్పింది. కానీ 45 రోజుల తర్వాత రాష్ట్ర సర్కారు రా రైస్​ ఇస్తామంటూ ప్రతిపాదనలు పంపింది. ఇదే నిర్ణయం అప్పుడే తీసుకొని ఉంటే రైతులు ధాన్యం రూ.1300.. రూ.1400 లకు చొప్పున అగ్గువకు అమ్ముకొని నష్టపోయే వారు కాదు. ఈ యాసంగి సీజన్​లో ఇప్పటికే మిల్లర్లు దాదాపు 10లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. రాష్ట్రం ముందే ఈ ప్రతిపాదనలు చేసి ఉంటే ఇందులో 60 శాతం నుంచి 70 శాతం ధాన్యానికి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేది.