రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు

రాష్ట్రంలో  దంచికొడుతున్న ఎండలు
  • ఇప్పటికే 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు 
  • ఇల్లందులో 43.3, గిరిమెల్లపాడులో 43.2 డిగ్రీలు నమోదు 
  • రానున్న రెండ్రోజుల్లో మరింత పెరిగే అవకాశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం వరకు ఎక్కువవుతోంది. ఎండలకు జనం ఇండ్లలోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌‌డీపీఎస్‌‌) డేటా ప్రకారం బుధవారం భద్రాద్రి కొత్తగూడెంలోని ఇల్లందులో 43.3, గిరిమెల్లపాడులో 43.2, ఖమ్మంలోని వైరాలో 43.1, గుబ్బగుర్తిలో 43, గౌరారంలో 42.9, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌‌నగర్‌‌లో 42.9 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాల వారీగా సగటు ఉష్ణోగ్రతలు చూస్తే.. ఖమ్మంలో 41.5, భద్రాద్రి కొత్తగూడెంలో 41.3, మంచిర్యాలలో 40.9, కుమ్రంభీం ఆసిఫాబాద్ లో 40.8, నల్గొండలో 40.6, సూర్యాపేటలో 40.4, ఆదిలాబాద్‌‌, యాదాద్రి భువనగిరిలలో 40.2, నారాయణపేటలో 40.1, హైదరాబాద్‌‌లో 38.1 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. కాగా, రానున్న రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్‌‌, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఎండలు ఎక్కువవుతాయని పేర్కొంది. 

సీజనల్ వ్యాధులు వచ్చే చాన్స్..
ఎండాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్వరం, జలుబు, గ్యాస్ట్రో ఎంటరైటీస్, డయేరియా లాంటి జబ్బులు వచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. అదే విధంగా చికెన్‌‌పాక్స్, కామెర్లు, టైఫాయిడ్‌‌ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలో పనిచేసే వాళ్లు గంటకు లీటరు చొప్పున నీళ్లు తాగాలి. ఉప్పు, చక్కెర కలిపిన నీరు కూడా మేలు చేస్తుంది. కరబూజ, అంగూర్లు, దోసకాయలు తినాలి. నల్ల బట్టలు, హ్యాండ్‌‌ బ్యాగులు వాడకపోవడమే మంచిది. వదులుగా ఉండే కాటన్‌‌ బట్టలు వేసుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు టోపీ పెట్టుకోవడంతో పాటు ఛత్రి తీసుకెళ్లాలి. బైక్ పై వెళ్లేవాళ్లు తడిపిన రుమాలు తలకు, ముఖానికి కట్టుకొని హెల్మెట్‌‌ పెట్టుకోవాలి. ఎండలో ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తే.. రెండు గంటలకోసారి నీడ పట్టున రెస్ట్‌‌ తీసుకోవాలి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల టైమ్ లో అవసరమైతేనే బయటకు రావాలి. పిల్లలు, పెద్దలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.