తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'మన్మథుడు'గా, 'కింగ్'గా, 'శివ'గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులోనూ నవ యువకుడిలా కనిపిస్తూ, వైవిధ్యమైన పాత్రలతో ప్రయోగాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. అయితే, ఇన్ని దశాబ్దాల కెరీర్‌లో నాగార్జునను ఇంకా ఊరిస్తున్న ఒకే ఒక్క కల ఉంది.. అదే 'మహాభారతం'. లేటెస్ట్ గా నాగ్ తన మనసులో మాటను భయటపెట్టాడు. ఇది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్ స్పూర్తితో..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. నేను మా నాన్నగారు (ఏఎన్నార్), ఎన్టీఆర్ గారి పౌరాణిక చిత్రాలు చూస్తూ పెరిగాను. నా కెరీర్‌లో సోషియో-ఫాంటసీ, భక్తిరస చిత్రాలు చేశాను కానీ, పూర్తిస్థాయి పౌరాణిక యుద్ధ తంత్రంలో నటించాలనే కోరిక బలంగా ఉంది. ఎవరైనా మహాభారతాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తే, అందులో ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి నేను సిద్ధం అని ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజమౌళి ‘డ్రీమ్ ప్రాజెక్ట్’పై నాగ్ ఆశ?
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి కూడా 'మహాభారతం' తీయడం అనేది ఒక జీవితకాలపు కల. పది భాగాలుగా ఈ మహాకావ్యాన్ని నిర్మించాలని ఆయన గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ బాబుతో అడ్వెంచర్ సినిమా ' వారణాసి' పనుల్లో బిజీగా ఉన్న జక్కన్న, ఆ తర్వాత మహాభారతంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
►ALSO READ | ట్రోలర్లకు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్లపై క్లారిటీ!
నాగార్జున లాంటి సీనియర్ హీరో, తను ఏ పాత్రకైనా సిద్ధమని చెప్పడం రాజమౌళికి ఒక పెద్ద వరం లాంటిదే. భీష్ముడిగానో, కర్ణుడిగానో లేదా శ్రీకృష్ణుడి పాత్రలోనో నాగార్జునను ఊహించుకోవడం అభిమానులకు పూనకాలు తెప్పించే విషయమే. గతంలో రాజమౌళి రూపొందించిన 'బాహుబలి'లో పౌరాణిక ఛాయలు ఉన్నప్పటికీ, అసలు సిసలు భారతాన్ని నాగార్జున వంటి అనుభవజ్ఞులతో తీస్తే అది అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ అవుతుంది.
'నాగ్ 100' వైపు అడుగులు..
ప్రస్తుతం నాగార్జున తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నారు. ధనుష్ తో కలిసి 'కుబేర'లో ఒక పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. ఆతర్వాత రజనీకాంత్ 'కూలీ' చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. 'బ్రహ్మాస్త్ర'లో నంది అస్త్రగా ఆయన చేసిన అతిథి పాత్రకు హిందీ బెల్ట్‌లో కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇది ఆయన పాన్-ఇండియా ఇమేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లింది.ప్రస్తుతం తన 100వ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తూ, వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
ఒకవైపు తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్‌ను ఏలుతోంది. మరోవైపు పౌరాణిక గాథలకు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నాగార్జున కోరిక, రాజమౌళి విజన్ కలిస్తే.. అది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం అవుతుంది . ఆ రోజు ఎంతో దూరంలో లేదని అభిమానులు ఆశిస్తున్నారు.
