ట్రోలర్లకు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్లపై క్లారిటీ!

ట్రోలర్లకు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్లపై క్లారిటీ!

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉగాది ( మార్చి 19, 2026 ) కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ' ఉస్తాద్ భగత్ సింగ్'.  గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో స్పందించారు.

వారికి జవాబు చెప్పను!

లేటెస్ట్ గా అభిమానులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో హరీష్ శంకర్‌కు ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ.. నేను ట్రోలర్లను అస్సలు సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే వారికి తమ అసలు పేరును, అడ్రస్‌ను బయటపెట్టే ధైర్యం లేదు. నేను ఏదైనా మాట్లాడితే దానికి పూర్తి బాధ్యత వహిస్తాను. కానీ, ముఖం చాటేసి విమర్శించే వారి మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను వారిని సీరియస్‌గా తీసుకుంటే ఈపాటికే సోషల్ మీడియా నుండి తప్పుకునేవాడిని అని కౌంటర్ ఇచ్చారు హరీష్ శంకర్..

మొదటి ట్రోలర్లు నా తల్లిదండ్రులే!

తల్లిదండ్రులను ఉద్దేశించి హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నేను డైరెక్టర్ అవుతానని చెప్పినప్పుడు నన్ను మొదట ట్రోల్ చేసింది మా తల్లిదండ్రులే. ఒక సినిమాను అనేక అడ్డంకులను అధిగమించి, అనుకున్న సమయం కంటే ముందే థియేటర్లకు తీసుకురావడమే నా అతిపెద్ద విజయం. అవుట్‌పుట్ విషయంలో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ప్రేక్షకులు ఉస్తాద్‌ను ప్రేమిస్తున్నారు అని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా, హద్దులు దాటి బూతులు తిట్టే వారిని బ్లాక్ చేయడమే కాకుండా, చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు.

►ALSO READ | ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ సతీమణి అన్నా లెజ్నెవా.. ఫాలోయింగ్ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

వరుస ప్రమోషన్స్ తో...

తమిళ హిట్ చిత్రం 'తేరి'కి రీమేక్‌గా వచ్చినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేశారు హరీష్. పవన్ సరసన, శ్రీలీల, రాశిఖన్నా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కలెక్షన్ల పరంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. ఫేక్ లెక్కలను నమ్మవద్దని, థియేటర్లలో రెస్పాన్స్ బాగుందని ఆయన చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2' మూవీ ఎఫెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా పడిందని, అందుకే కొంత మేరకు వసూళ్లు తగ్గినట్లు చెప్పుకొచ్చారు హరీష్.  ప్రస్తుతం ఈ సినిమా గట్టేకించేందుకు ప్రమోషన్ల కోసం హరీష్ శంకర్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' త్వరలోనే ఓటిటిలో కూడా సందడి చేయనుంది.