పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ( మార్చి 25, 2026 ) ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించడంతో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఆమెకు స్వాగతం పలుకుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
స్వాగతం పలికిన పవన్..
చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అన్నా లెజ్నెవా, ఇప్పుడు '@Anna.Konidela' పేరుతో డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె రాకను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేక నోట్ రాశారు. "ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం అన్నా.. ఈ వేదికపై నీ ప్రయాణం అర్థవంతంగా, స్ఫూర్తిదాయకంగా సాగాలని కోరుకుంటున్నాను" అంటూ ఆయన విష్ చేశారు.
తొలి పోస్ట్‌తోనే ఫిదా!
తన ఇన్‌స్టాగ్రామ్ ప్రయాణాన్ని అన్నా లెజ్నెవా ఎంతో మధురంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్, తాను కలిసి ఉన్న ఒక అన్-సీన్ ఫోటోను ఆమె షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపిస్తుండటం అభిమానులను కట్టిపడేస్తోంది. "చాలా కాలం తర్వాత.. ఇప్పుడు సరైన సమయం అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చాను" అంటూ ఆమె రాసుకొచ్చారు.
►ALSO READ | డార్లింగ్ ప్రభాస్ కోసం థియేటర్‌కు వెళ్తా.. కానీ ఆ ఛాన్స్ వస్తే నో చెప్పేస్తా!
కేవలం గంట వ్యవధిలోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య లక్షకుపైగా దాటిపోవడం మెగా పవర్ ఏంటో నిరూపించింది. ఇక ఆమె బయోలో "రష్యన్ హార్ట్.. ఇండియన్ సోల్" అని పేర్కొనడం అందరినీ ఆకర్షిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అన్నాకు వెల్‌కమ్ చెబుతూ విష్ చేశారు.
అన్నా ఫాలోయింగ్ లిస్ట్ ఇదే!
అన్నా తన ఖాతాలో ప్రస్తుతం 35 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇందులో మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో పాటు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, సమంత, ఎస్.ఎస్. రాజమౌళి, ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి సెలబ్రిటీలు ఉన్నారు. ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఫాలో అవుతున్నారు.
పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా మొదటిసారి 2011లో ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. 2013లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పొలెనా అంజనా పవనోవా అనే కుమార్తె ఉన్నారు. పవన్ రాజకీయ ప్రస్థానంలోనూ అన్నా ఆయనకు వెన్నుముకగా ఉంటూ, ఇటీవల జరిగిన పలు ప్రభుత్వ వేడుకల్లోనూ చురుగ్గా కనిపిస్తున్నారు.
