ఈ ఏడాది రూ.4.71 లక్షల కోట్లు పెరిగిన 7 మంది భారతీయ కుబేరుల సంపద

ఈ ఏడాది రూ.4.71 లక్షల కోట్లు పెరిగిన 7 మంది భారతీయ కుబేరుల సంపద

కరోనా టైమ్‌లోనూ వీరి సంపద పెరుగుతూనే ఉంది

షేర్లు పెరగడంతో లాభాల పంట

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: ఈ ఏడాది అందరికీ కలిసి రాకపోయినా ఏడు మంది బిలినియర్లకు మాత్రం లాభాల పంట పండించింది. కరోనా సంక్షోభంతో భారీగా పడ్డ మార్కెట్లు తిరిగి రికార్డ్‌‌ స్థాయిలను అందుకున్న విషయం తెలిసిందే. దేశ ఎకానమీ కూడా రికవర్‌‌ అవుతోంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గౌతమ్‌‌ అదానీ, ముకేష్‌‌ అంబానీ, శివ్‌‌నాడర్‌‌‌‌, సైరస్‌‌ పూనావాలా, ప్రేమ్‌‌జీ, రాదాకిషన్‌‌ దమానీ, దిలిప్‌‌ సంఘ్వీల సంపద రూ. 4.71 లక్షల కోట్లు( సుమారు 64 బిలియన్‌‌ డాలర్లు) పెరిగింది. వీరి మొత్తం సంపద రూ. 14.31 లక్షల కోట్లకు(194.39 బిలియన్‌‌ డాలర్లకు) చేరుకుంది. బ్లూమ్‌‌బర్గ్‌‌ బిలినియర్‌‌‌‌ ఇండెక్స్‌‌ ప్రకారం అదానీ గ్రూప్ ఓనర్

గౌతమ్‌‌ అదానీ సంపద ఈ ఏడాది రూ. 1.55 లక్షల కోట్లు( 21.1 బిలియన్‌‌ డాలర్లు) పెరిగింది. గతేడాది ఈయన సంపద 11.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం 32.4 బిలియన్‌‌ డాలర్లకు చేరుకొంది. మరోవైపు రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సంపద ఇదే టైమ్‌‌లో 18.1 బిలియన్ డాలర్లు(రూ. 1.33 లక్షల కోట్లు) పెరిగింది. గతేడాది డిసెంబర్‌‌‌‌లో అంబానీ సంపద 58.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం 76.7 బిలియన్‌‌ డాలర్లకు చేరుకుంది. ఆయిల్‌‌ అండ్‌‌ గ్యాస్‌‌, టెలికాం, రిటైల్‌‌ సెక్టార్లలో రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ వ్యాపారం చేస్తోంది.

ఒకప్పుడు డబ్బుల కోసం అదానీని కిడ్నాప్‌‌ చేశారు..

డబ్బుల కోసం అదానీని కిడ్నాప్‌‌ చేశారనే విషయం తెలుసా? 20 ఏళ్ల కిందట ఈ సంఘటన జరిగింది. ఇదే కాదు 2008 లో ముంబై తాజ్‌‌హోటల్‌‌పై జరిగిన ఉగ్రవాదులు దాడుల నుంచి కూడా ఆయన ధైర్యంగా బయటపడ్డారు. అప్పుడు ఆయన్ని హోస్టేజ్‌గా ఉగ్రవాదులు బంధించారు. ఈ సంఘటనల తర్వాత ఆయన బిజినెస్‌‌ వ్యూహాల్లో మార్పులొచ్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అనేక బిజినెస్‌‌లలో  అదానీ గ్రూప్‌‌ విస్తరించి ఉంది. ఈ ఏడాది రూ. 44,178 కోట్ల విలువైన సోలార్‌‌‌‌ పవర్ డీల్స్‌‌ను అదానీ గ్రీన్‌‌ ఎనర్జీ గెలుచుకుంది. కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి.  దేశంలోనే ముకేష్ అంబానీ తర్వాత అత్యంత ధనవంతుడుడిగా అదానీ ఉన్నారు. ఈ ఏడాది ఆయనకు వచ్చిన సంపద అంబానీకి వచ్చిన దానికంటే ఎక్కువ కావడం విశేషం.  కాగా, రెన్యూవబుల్‌‌ ఎనర్జీ, పోర్టులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్‌‌ వంటి బిజినెస్‌‌లను గౌతమ్‌‌ అదానీ చేస్తున్నారు. వీటితో పాటు కొత్తగా డేటా స్టోరేజి, ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ బిజినెస్‌‌లలోకి కూడా ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు.