అడ్జస్ట్ చేసినా.. టీచర్లు సాల్తలేరు

అడ్జస్ట్ చేసినా.. టీచర్లు సాల్తలేరు

సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వం ఎటూ తేల్చట్లేదు. 12 వేల మంది విద్యావలంటీర్లను పక్కన బెట్టిన సర్కారు.. ఉన్న టీచర్లతోనే ఆ ఖాళీలను అడ్జస్ట్​ చేస్తోంది. అయినా టీచర్ల కొరత తీరడం లేదు.సిరిసిల్లా జిల్లాలోని మానాల హైస్కూలులో 132 మంది స్టూడెంట్లున్నారు. ఈ స్కూల్​లో 9 మంది టీచర్లుండాలి. కానీ ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. అడ్జెస్ట్ మెంట్ లో భాగంగా ఇటీవల ఒక టీచర్​ను వారంలో మూడు రోజులు కేటాయించారు. అయినా ఇంకా నలుగురు టీచర్లు అవసరం. దీంతో స్టూడెంట్ల భవిష్యత్​దృష్ట్యా ఉన్న టీచర్లే, మిగిలిన సబ్జెక్టులు బోధిస్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల ఖాళీలపై సర్కారు ఎటూ తేల్చట్లేదు. 12 వేల మంది విద్యావలంటీర్లను పక్కన బెట్టిన సర్కారు.. ఉన్న టీచర్లతోనే ఆ ఖాళీలను అడ్జస్ట్ ​చేస్తోంది. అయినా టీచర్ల కొరత తీరడం లేదు. ఈ ఏడాది సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగినా, టీచర్ల ఖాళీలపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల్లో గానీ, సర్కారులో గానీ ఎలాంటి చలనం లేదు. అడ్జస్ట్​మెంట్​పేరుతో కేవలం హైస్కూళ్లలోనే కొందరు టీచర్లను పంపించినా, మిగిలిన ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను వదిలేశారు. దీంతో ఉన్న టీచర్లపై భారం పెరుగుతోంది. స్టూడెంట్ల చదువులు ఆగమవుతున్నాయి. 
అడ్జెస్ట్​ చేసినా..
రాష్ట్రంలో 26,050 సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లుండగా వాటిల్లో 1.06 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరితో పాటు గతంలో మరో 12 వేల మంది విద్యావలంటీర్లు ఉండేవారు. నిరుడు కరోనా ఎఫెక్ట్​తో బడుల్లో ఫిజికల్ క్లాసులు కేవలం నెలరోజులే నడిచాయి. దీంతో వారిని డ్యూటీలోకి తీసుకోలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ ఫస్ట్ నుంచే ఫిజికల్ క్లాసులు ప్రారంభమైనా వీవీలను మళ్లీ తీసుకోలేదు. వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రంలో చాలా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో స్టూడెంట్ల నిష్పత్తితో పోలిస్తే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారని, ఎక్సెస్ ఉన్న వారిని విద్యావలంటీర్ల స్థానాల్లో నింపుతున్నామని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఈ ప్రక్రియ అన్ని జిల్లాల్లో  కొనసాగింది. ఒక్కో జిల్లాలో 150 నుంచి 300 వరకు, రాష్ట్రంలో 6 నుంచి 7 వేల వరకు టీచర్లను ఈ విధానంలో అడ్జెస్ట్ చేశారు. అయితే ఇలా అడ్జెస్ట్ ​చేస్తున్నా.. ఎక్కడా పూర్తి స్థాయిలో టీచర్ల కొరత తీరడం లేదు. అధికారులు మాత్రం ప్రాసెస్ ఇంకా కొనసాగుతోందని, ఎక్కడ అవసరముంటే అక్కడికి టీచర్లను పంపిస్తున్నామంటున్నారు. కొందరు టీచర్లను కొత్త స్కూళ్లకు డిప్యూటేషన్లపై పంపిస్తుండగా, కొందరిని వారంలో మూడు రోజులు సబ్జెక్టు టీచర్ లేని చోట పాఠాలు చెప్పేలా డీఈఓలు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే ఫిజికల్ క్లాసులు మొదలై నెలన్నర అవుతున్నా వందల స్కూళ్లలో ఇంకా టీచర్ల కొరత ఉంది. పలు హైస్కూళ్ల​లో సబ్జెక్టుల పాఠాలు మొదలు కాలేదు. దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు టీచర్లు చెబుతున్నారు. స్కూళ్లలో ఖాళీల కొరత వాస్తమేనని, సాధ్యమైనంత మేరకు అడ్జెస్టు చేస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సర్కారు నుంచి వీవీలను తీసుకోవాలని ఆర్డర్స్ వస్తే తీసుకుంటామని ఆయన తెలిపారు.