హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బయటకొస్తే ఊరుకునేది లేదు

హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బయటకొస్తే ఊరుకునేది లేదు

హోం క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు మాత్రం బయట తిరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ట్రాక్‌ చేసి వాళ్లను పట్టుకుంటామన్నారు.  మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల..విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు 14 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని.. వారు స్వీయ నియంత్రణ పాటించాలని.. కుటుంబసభ్యులు కూడా వాళ్లని బయటకు వెళ్లకుండా చేయాలన్నారు.

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించాలన్నారు మంత్రి ఈటల. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేశామని.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది కూడా విధులకు రావాలని స్పష్టం చేశారు. సాధారణ ఓపీలు, అత్యవసరం కాని చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దని ప్రజలను కోరారు.

బాధితుల సంఖ్య పెరగకుండా ముందు జాగ్రత్తలు పాటిద్దామని పిలుపునిచ్చారు మంత్రి ఈటల. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని.. ఎవరికి వాళ్లు ఇళ్లలో ఉండటమే కరోనా నిరోధానికి సరైన చికిత్స అని ఆయన వివరించారు. ఇవాళ స్టేజ్‌-2లో ఉన్నామని.. స్టేజ్‌-3 పరిస్థితి రానీయవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు అందరూ సహకరించాలని.. ఈనెల 31 వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు ఈటల.