
హైదరాబాద్, వెలుగు : దేశంలో మోదీ వేవ్ ఉందని, ఆ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోందని మాజీ ఎంపీ, కరీంనగర్బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ అన్నారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయిందన్నారు. కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటేయాలని చెప్పారని, తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు డిపాజిట్ రాలేదని, ఈసారి వెలిచాల రాజేందర్ రావుకు కూడా డిపాజిట్ రాదన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో వినోద్ మీడియాతో మాట్లాడారు.
దేశంలో బీజేపీకి 272 సీట్లు రాకపోతే బీజేపీ వాళ్లే మోదీ ప్రధాని పదవి చేపట్టకుండా అడ్డుకుంటారని చెప్పారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ గెలిస్తే అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రామ మందిరాన్ని కూల్చే దమ్ము ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను తాము ప్రజల్లోకి తీసుకెళ్లామని, హస్తం పార్టీ చేసిన మోసాలను ప్రజలకు వివరించామని చెప్పారు. ఆ వ్యతిరేకత ఓటు తనకు పూర్తిగా మళ్లితే కరీంనగర్‌లో తన గెలుపు ఖాయమన్నారు.