ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణాలు, వ్యక్తిగత హామీలకు సంబంధించి మూడు ప్రధాన బ్యాంకులు ఆయనపై తీసుకుంటున్న కఠిన చర్యలపై బాంబే హైకోర్టు స్టే విధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు అనిల్ అంబానీని 'ఫ్రాడ్' గా ప్రకటించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాజా కోర్టు తీర్పుతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్.. దాని అనుబంధ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో బ్యాంకులు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, నిధులను మళ్లించారని ఆరోపిస్తూ అనిల్ అంబానీ ఖాతాలను 'ఫ్రాడ్' కేటగిరీలో చేర్చాలని భావించాయి. దీనిపై అనిల్ అంబానీ కోర్టును ఆశ్రయించారు. తన వాదన వినకుండా.. సరైన నోటీసులు ఇవ్వకుండా బ్యాంకులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని ఆయన వాదించారు.
బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ.. సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఒక వ్యక్తిని మోసగాడిగా ముద్ర వేసే ముందు అతనికి వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలని పేర్కొంది. బ్యాంకులు ఏకపక్షంగా అంబానీని లేదా ఆయన కంపెనీలను దోషులుగా ప్రకటించడాన్ని కోర్టు తప్పుబట్టింది. తదుపరి విచారణ వరకు అంబానీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే బయటి సంస్థలు చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ నమ్మి ఏకపక్షంగా చర్యలు సరైనవి కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఆడిట్ చేయటానికి సదరు సంస్థకు చట్టపరమైన అనుమతి లేదని, రిపోర్ట్ పై ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ సంతకం కూడా లేదని అంబానీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ALSO READ : నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి
ఒకవేళ బ్యాంకులే గనుక అనిల్ అంబానీని ఫ్రాడ్‌గా ప్రకటిస్తే.. భవిష్యత్తులో ఆయన ఏ బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశం ఉండదు. అంతేకాకుండా కంపెనీ బోర్డుల నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి బాంబే హైకోర్టు స్టే ఇవ్వడంతో అంబానీకి చట్టపరంగా ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది. అయితే రుణాలు ఎగవేతకు సంబంధించి దివాలా ప్రక్రియ, ఇతర దర్యాప్తు సంస్థల విచారణలు కొనసాగుతూనే ఉంటాయి.
