ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్త జెనోమిక్ క్లినికల్ రీసెర్చ్ రంగంలో భారత్ ఒక కీలక శక్తిగా అవతరించింది. 1990 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన సుమారు 235 పరిశోధనల్లో భారత్ భాగస్వామిగా నిలిచింది. దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో భారత్ అత్యంత చురుకైన దేశంగా నిలవడం విశేషం. అయితే ఈ గణాంకాల వెనుక కొన్ని కీలకమైన సవాళ్లు, అసమానతలు కూడా ఉన్నాయని నివేదిక హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స, ఔషధాల తయారీలో మానవ జెనోమిక్ సాంకేతికతలను ఉపయోగిస్తూ సుమారు 6,500 అధ్యయనాలు జరిగాయి. ఇందులో భారత్ ముందంజలో ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశోధనలు కేవలం 10 దేశాలకే పరిమితమయ్యాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ వంటి సంపన్న దేశాలతో పాటు భారత్ కూడా అగ్రస్థానంలో ఉంది. కానీ భారత్‌లో జరుగుతున్న ఈ పరిశోధనల్లో మెజారిటీ భాగం విదేశీ సంస్థల నిధులతో.. అంతర్జాతీయ ట్రయల్స్‌లో భాగంగా జరుగుతున్నవే. స్థానిక అవసరాలకు అనుగుణంగా మనమే సొంతంగా రూపొందించుకున్న పరిశోధనలు ఇంకా పెరగాల్సి ఉంది.
వ్యాధుల పరంగా చూస్తే.. భారత్ వంటి దేశాల్లో 60 శాతానికి పైగా జెనోమిక్ అధ్యయనాలు క్యాన్సర్, అరుదైన వ్యాధులు, లైఫ్ స్టైల్ అనారోగ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. కానీభారతదేశంలో ఇప్పటికీ ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా ఉన్న టిబీ, హెచ్ఐవీ, మలేరియా వంటి అంటువ్యాధులపై జెనోమిక్ పరిశోధనలు కేవలం 5 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంటువ్యాధుల పట్ల మానవ శరీరంలోని జన్యువులు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడం ద్వారా మెరుగైన నివారణ వ్యూహాలను రూపొందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
►ALSO READ | నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్
మరో ప్రధానమైన అంశం వయస్సు పరంగా ఉన్న అసమానత. ప్రపంచవ్యాప్త పరిశోధనల్లో 75 శాతం కేవలం 18 నుండి 64 ఏళ్ల వయస్సు గల వారిపైనే జరుగుతున్నాయి. చిన్నపిల్లలపై కేవలం 4.6 శాతం, వృద్ధులపై 3.3 శాతం మాత్రమే అధ్యయనాలు జరుగుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో వయస్సును బట్టి వ్యాధుల తీరు మారుతున్న నేపథ్యంలో, కేవలం పెద్దల డేటా ఆధారంగా రూపొందించే చికిత్సలు పిల్లలకు లేదా వృద్ధులకు పూర్తిస్థాయిలో సరిపోకపోవచ్చని WHO హెచ్చరించింది.
ప్రస్తుతం భారతదేశంలోని ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, బయోటెక్ సంస్థలు జెనోమిక్ రంగంలో తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. అయితే కేవలం విదేశీ ట్రయల్స్ కోసం ఒక 'లొకేషన్'గా ఉండటం కంటే.. భారత్ తన సొంత డేటా సెట్లను, పరిశోధనా ప్లాట్‌ఫారమ్‌లను అభివృద్ధి చేసుకోవాలని నివేదిక సూచించింది. అప్పుడే జెనోమిక్ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు సామాన్య భారతీయులకు కూడా పూర్తిస్థాయిలో అందుతాయని WHO స్పష్టం చేసింది.
