భారత్ చమురు కొనుగోళ్లు అమెరికా నిర్ణయించాలా? ఇంధన భద్రతపై మన విధానమేంటి?: లోక్ సభలో రాహుల్ గాంధీ ఆగ్రహం

భారత్ చమురు కొనుగోళ్లు అమెరికా నిర్ణయించాలా? ఇంధన భద్రతపై మన విధానమేంటి?: లోక్ సభలో రాహుల్ గాంధీ ఆగ్రహం
  • రష్యా నుంచి క్రూడాయిల్ కొనేందుకు
  • అమెరికా పర్మిషన్ ఎందుకు?
  • యుద్ధ ప్రభావం భారత్ పై తీవ్రంగా ఉంది
  • హార్ముజ్ మూతతో తీవ్రంగా చమురు సమస్య


ఢిల్లీ: భారత్.. చమురు కొనుగోళ్లను అమెరికా నిర్ణయించాలా..? రష్యా నుంచి క్రూడాయిల్ కొనేందుకు యూఎస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.. అంటూ తనదైన శైలిలో నిలదీశారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. గురువారం (మార్చి 12) లోక్ సభలో చమురు సమస్యపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇంధన భద్రతపై మన విధానమేంటో చెప్పాలని నిలదీశారు. ఒక దేశానికి ఇంధన భద్రతే పునాది అని పేర్కొన్నారు. భారతదేశం వంటి పెద్ద దేశం తన విదేశాంగ, వాణిజ్య సంబంధాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. 

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైందని, దీని ప్రభావం ప్రపంచవ్యా ప్తంగా తీవ్రంగా ఉండబోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వెళ్లే హార్ముజ్ జలసంధి మూసివేయబడిందని పేర్కొంటూ ఇది భారత్ కు పెద్ద ముప్పుగా మారవచ్చని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కష్టాలు ఇక్కడితో ఆగవని, అవి ఇంకా పెరుగుతాయన్నారు. భారత్ కు వచ్చే చమురు, సహజ వాయువులో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే వస్తుందని గుర్తుచేశారు. ఇప్పటికే గ్యాస్ కొరతపై భయాందోళనలు మొదలయ్యాయని, కొన్ని ప్రాంతాల్లో రెస్టారెంట్లుమై తపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంధన భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం ముందుగా ప్రణాళికలు రూపొందించడంలో విఫలం అయ్యిందన్నారు. దేశ ప్రజలు గ్యాస్ కోసం నానా అవస్థలు పడుతుంటే.. ప్రధాని మాత్రం తన మిత్రుల ప్రయోజనాలను కాపాడటంలోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ లోపల, బయట ఈ అంశంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసి, గ్యాస్ సరఫరాను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.