Theater Movies: క్రిస్మస్ ట్రీట్‌గా ప్రేక్షకులకు భారీ వినోదం.. రేపు (Dec25) థియేటర్లలోకి 8 సినిమాలు.. ఇంట్రెస్టింగ్ జోనర్లలో

Theater Movies: క్రిస్మస్ ట్రీట్‌గా ప్రేక్షకులకు భారీ వినోదం.. రేపు (Dec25) థియేటర్లలోకి 8 సినిమాలు.. ఇంట్రెస్టింగ్ జోనర్లలో

2025 క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సినిమా ప్రేక్షకులకు భారీ వినోదం అందించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. రేపు గురువారం  (25 డిసెంబర్ 24న) థియేటర్లలోకి 10కిపైగా సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలు, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందుకు మరి కారణం.. ఈ క్రిస్మస్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు పోటీగా తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా, యూత్‌ఫుల్ కంటెంట్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ డ్రామాలు కూడా విడుదలవుతుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులకుసాలిడ్ విందు అందించనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ? జోనర్స్ ఏంటనే విషయాలు తెలుసుకుందాం.. 

రోషన్ ఛాంపియన్ : 

రోషన్, అనస్వర రాజన్‌‌‌‌ జంటగా ప్రదీప్ అద్వైతం రూపొందించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. అశ్వినీదత్,  జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి. రొటీన్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా ఒక బలమైన కథ, సంఘర్షణ ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇందులోని సీన్స్..  ఛాంపియన్ కథను స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తోంది. 

బైరాన్‌పల్లి.. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలంలో ఉన్న ఒక చారిత్రక గ్రామం. నిజాం కాలంలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, 100 మందికి పైగా గ్రామస్థులు ప్రాణత్యాగం చేసిన వీరత్వానికి ఈ గ్రామం ప్రతీకగా నిలుస్తుంది. గ్రామంలోని బురుజు (కోట) వారి పోరాటానికి గుర్తుగా ఉంది. 

ఇది జలియన్‌వాలా బాగ్ మారణహోమాన్ని తలపించే ఘటన. ఆగస్టు 27, 1948న రజాకార్లు గ్రామంపై దాడి చేసి, సుమారు 119 మంది గ్రామస్తులను చంపి, వారి శవాలను ఊరి మధ్యలో ఉన్న బురుజు చుట్టూ ఉంచి బతుకమ్మ ఆడించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం అయిన ఈ కథను ఆధారంగా చేసుకుని ‘ఛాంపియన్’ సినిమాను దర్శకుడు ప్రదీప్ తెరకెక్కించాడు.

2. శివాజీ దండోరా :

శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ,  బిందు మాధవి ప్రధాన పాత్రల్లో మురళీకాంత్  రూపొందించిన చిత్రం ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. రేపు డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ‘తెలంగాణ రూటెడ్ ఫిల్మ్గా తెరకెక్కింది. ఇందులో ఎంట‌‌ర్‌‌టైన్‌‌మెంట్‌‌, ఎమోష‌‌న్స్‌‌, డ్రామా, ఎగ్రెష‌‌న్ అన్నీ ఉన్నాయి. సోషల్ డ్రామాగా క్యాస్ట్ ఇష్యూతో సినిమాని రూపొందించారు మేకర్స్. 

3. ఆది శంబాల :

హీరో ఆది సాయి కుమార్ నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కింది. ఇందులో జియో సైంటిస్ట్‌‌గా (భౌగోళిక శాస్త్రవేత్తగా) ఆది కనిపించాడు.

ఈ కథనం 1980ల నాటి వాతావరణంలో, ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో జరుగుతున్న అంతుచిక్కని హత్యలు, అతీంద్రియ సంఘటనలను పరిశోధించడానికి జియో-సైంటిస్ట్ విక్రమ్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు. దేవుళ్లు, అద్భుతాలు అంటూ దేనినీ నమ్మని హేతువాది అయిన విక్రమ్‌కు, ఈ మిస్టికల్ శక్తిని ఛేదించడం ఒక పెను సవాల్ మారుతుంది.. లాజిక్‌కు, మర్మమైన శక్తులకు మధ్య జరిగే ఈ భీకర పోరాటమే సినిమా కథాంశం.

4. ఈషా:

అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈషా’ (Eesha). హెబ్బా పటేల్ హీరోయిన్‌‌‌‌గా నటించింది. శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ని కేఎల్‌‌‌‌ దామోదర ప్రసాద్‌‌‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రేపు డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.

హార్రర్ థ్రిల్లర్లో జానర్లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇది కొత్తగా తెరకెక్కినట్టు విజువల్స్ చూస్తే తెలుస్తోంది. ఆత్మలు, మూఢ నమ్మకాలపై సాగిన సీన్స్ ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. మేకర్స్ సైతం హార్ట్ వీక్ ఉన్నవాళ్లు సినిమాని చూడొద్దు అని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. ఇది గుర్తుంచుకుని సినిమాకి వెళ్ళండి. 

5. పతంగ్:

ప‌‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌‌తంగ్’(PATANG).  ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ప్రీతి ప‌‌గ‌‌డాల‌‌, సరిగమప సింగర్ ప్రణ‌‌వ్ కౌశిక్‌‌, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పీ చరణ్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, విష్ణు ఓయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ బ్యానర్స్పై విజ‌‌య్ శేఖ‌‌ర్ అన్నే, సంప‌‌త్ మ‌‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. మధ్యలో ఓ అమ్మాయి.. ఆమె కోసం ఆ ఇద్దరూ శత్రువులుగా మారి కొట్టుకోవడమే మెయిన్ స్టోరీలా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

6. బ్యాడ్ గర్ల్స్:

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ ఫణి ప్రదీప్ ధూళిపూడి రూపొందించిన చిత్రం ‘బ్యాడ్‌‌‌‌ గాళ్స్‌‌‌‌’. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్‌‌‌‌లైన్. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌‌‌‌లో నటించారు. రేణూ దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

క్రిస్మస్ కానుకగా రేపు డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది.  ‘‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. అమ్మాయిలు లీడ్ రోల్స్‌‌‌‌లో జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమే ఇదని’’ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. 

7. మార్క్:

కన్నడ స్టార్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘మార్క్‌‌’(MARK). సుదీప్ కెరీర్‌‌‌‌లో ఇది 47వ చిత్రం ఇది. క్రిస్మస్‌ కానుకగా రేపు డిసెంబర్ 25న ‘మార్క్‌‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా మార్క్ తెరకెక్కింది. సిటీలో ఉన్నట్టుండి 18కి పైగా పిల్లలు మిస్ అవ్వడం, పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి అయిన హీరో.. సస్పెండ్‌ అవ్వడం.. అయినప్పటికీ, ఆ పిల్లల కేసును సుదీప్ ఎలా చేధించాడు అనేది ఈ సినిమా క‌థ అని టాక్. ఇందులో ముఖ్య పాత్రల్లో నవీన్‌ చంద్ర, షైన్ టామ్ చాకో నటించారు

8. మోహన్ లాల్ వృషభ:

మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో సమర్జీత్ లంకేష్, నయన్ సారిక జంటగా నంద కిషోర్ రూపొందించిన చిత్రం ‘వృషభ’.  ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.  ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌‌‌‌తో క‌‌‌‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్   నిర్మించింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న మూవీ విడుదల కానుంది. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. యాక్షన్ & లవ్ స్టోరీతో పాటు ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ కూడా సినిమాలో ఉండనుంది.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా, పండుగ కావడంతో చాలా చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో షోస్ సంఖ్యను కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఉండటంతో యూత్ మరియు కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే పరిస్థితి ఉంది. మొత్తానికి క్రిస్మస్ కానుకగా సినిమా అభిమానులకు ఇది ఒక ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. ఏ సినిమా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో, బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం పైచేయి సాధిస్తుందో చూడాలి.