పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ సంగతేంటో తేల్చండి

పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ సంగతేంటో తేల్చండి
  •                 ముగ్గురు ప్రొఫెసర్లతో కమిటీ వేసిన వైద్య విద్యాశాఖ
  •                 30లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం 
  •                 వివరణ ఇవ్వాలని నిలోఫర్ సూపరింటెండెంట్‌‌కు కిషన్ రెడ్డి ఆదేశం 

నిలోఫర్ హాస్పిటల్‌‌‌‌లో జరుగుతున్న క్లినికల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం త్రీమెన్ కమిటీని నియమించింది. ముగ్గురు సీనియర్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమిస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రయల్స్‌‌‌‌ వ్యవహారంపై మూడు రోజుల్లో (ఈ నెల30 నాటికి) నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌‌‌‌‌‌‌‌ నిబంధనల ప్రకారమే ట్రయల్స్‌‌‌‌ చేస్తున్నానని చెబుతున్న నేపథ్యంలో ఈ విషయంపై నిలోఫర్ సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్ మురళీ కృష్ణను ‘వెలుగు’ ప్రతినిధి ప్రశ్నించగా, ట్రయల్స్‌‌‌‌ చేస్తున్న వ్యక్తినే అడిగి తెలుసుకోవాలని సమాధానమిచ్చారు.  మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు స్పందించారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నిలోఫర్ సూపరింటెండెంట్‌‌‌‌ను కిషన్‌‌‌‌రెడ్డి ఆదేశించగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అచ్యుతరావు డిమాండ్ చేశారు.

సర్కారు వద్ద వివరాల్లేవ్..

నిలోఫర్‌‌‌‌‌‌‌‌లో క్లినికల్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ కు అనుమతి ఉందా? లేదా? అన్నది పక్కనపెడితే, ట్రయల్స్ జరుగుతున్నాయన్న మాట మాత్రం వాస్తవం. అయితే, మరికొన్ని టీచింగ్‌‌‌‌ హాస్పిటళ్లలోనూ క్లినికల్‌‌‌‌ ట్రయల్స్ జరుగుతున్నట్టు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ట్రయల్స్ చేయాలనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో మాత్రం ఏయే హాస్పిటల్‌‌‌‌లో ఏయే ట్రయల్స్ జరుగుతున్నాయన్న సమాచారం కూడా వైద్యారోగ్యశాఖ వద్ద లేదు. హాస్పిటల్‌‌‌‌ ఎథికల్ కమిటీ పేరిట అనుమతులు ఇవ్వడం, వాటినే ఆధారంగా చూపి ట్రయల్స్‌‌‌‌ చేయడం సర్వసాధారణమైందని అధికారులు అంటున్నారు.

టీచింగ్ హాస్పిటళ్లలో ‘ట్రయల్స్’ దందా

క్లినికల్ ట్రయల్స్‌‌‌‌కు వాలంటీర్లు దొరకకపోవడంతో, సర్కారు దవాఖానలకు వచ్చే పేద, నిరక్షరాస్య రోగులను లక్ష్యంగా చేసుకుని ప్రయోగాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాలంటీర్‌‌‌‌లకు తెలిసే ట్రయల్స్‌‌‌‌ జరగాలని, ఆడియో, వీడియో రూపంలో వ్యక్తుల అనుమతులు రికార్డు చేయాలన్న డీసీజీఐ నిబంధనలను డాక్టర్లు తుంగలో తొక్కుతున్నారు. హాస్పిటళ్లకు వచ్చే పేదలు, చదువురాని వాళ్లకు ఏవో కారణాలు చెప్పి సంతకాలు తీసుకుంటున్నట్టు ఆఫ్‌‌‌‌ ది రికార్డుగా హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్ అధికారులు చెబుతున్నారు.  ప్రైవేటు కంపెనీల వద్ద భారీగా ముడుపులు తీసుకుని ట్రయల్స్‌‌‌‌కు అనుమతిస్తున్నారని, దీంతో హాస్పిటళ్లకు చెడ్డ పేరు వస్తోందని మరికొందరు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు తయారు చేసే బ్రాండెడ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ను ప్రభుత్వ హాస్పిటళ్లలో సప్లై చేయనప్పుడు, అక్కడ ట్రయల్స్‌‌‌‌ చేయాల్సిన అవసరమేంటని, వాటితో ఎవరికి లాభమని వారు ప్రశ్నిస్తున్నారు.