కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఢీకొన్న రైళ్లు

కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఢీకొన్న రైళ్లు

హైదరాబాద్ కాచిగూడా రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కాచిగుడా స్టేషన్ లో కర్నూల్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వస్తున్న హంద్రీ ఎక్స్ ప్రెస్  – ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో రెండు రైళ్లలోని ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగిగాయి. ఈ ప్రమాదంలో 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎంఎంటీఎస్ ట్రైన్ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై రైల్వే పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్ లో సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పై రావడంతో ప్రమాదం జరిగింది. రెండో ట్రాక్ లో రావాల్సిన ఎంఎంటీఎస్ నాలుగో ట్రాక్ పై రావడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రమాదంలో రైల్వే పైలెట్ తప్పిదం ఏమీ లేదని, సిగ్నల్ ఆధారంగా ట్రాక్ ను మారుస్తారని, అదే సమయంలో రెండో ట్రాక్ పడాల్సిన సిగ్నల్ , నాలుగో ట్రాక్ పై సిగ్నల్ పడడంతో ఎంఎంటీఎస్ ట్రైన్ ట్రాక్ మారడంతో ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని  చెప్పారు.