ఈ నెల 26న భారత్ బంద్

ఈ నెల 26న  భారత్ బంద్

రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా లేటెస్టుగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి-26) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

26న భారత్‌ బంద్‌ చేపట్టాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ పిలుపునిచ్చారు. దీనికి 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతిచ్చాయి. జీఎస్టీ విధానాన్ని సమీక్షించాలని, కొత్త ఈ-వే బిల్లు విధానంతో పాటు కొన్ని నిబంధనలను రద్దు చేయాలని ఆలిండియా ట్రాన్స్ పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  బంద్ కు మద్దతిచ్చింది. దీంతో పాటు దేశంలో డీజిల్ ధరలు కూడా ఒకేలా ఉండాలని తెలిపింది. భారత్ బంద్ కు అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్లు మద్దతు తెలిపాయి. ఈ భారత్‌ బంద్‌లో దాదాపు 8 కోట్ల మంది వ్యాపారులు పాల్గొననున్నారు.