రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే

రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం చెల్లించాల్సిందేనని నేషనల్  ఇన్సూరెన్స్  కంపెనీ లిమిటెడ్ ను మోటార్  యాక్సిడెంట్  క్లెయిమ్స్ ట్రిబ్యూనల్  ఆదేశించింది. 30 రోజుల్లోపు పరిహారం చెల్లించాలని, ఆలస్యం చేస్తే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ట్రైబ్యునల్  హెచ్చరించింది. ఈమేరకు ట్రిబ్యూనల్  జడ్జి ఈ నెల 19న ఆదేశాలు జారీచేశారు. 2019 మే 31న ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో సెక్టార్  11 రోడ్డుపై మనీశ్  గౌతమ్  అనే ప్రభుత్వ ఉద్యోగి తన బంధువుతో కలిసి నడుచుకుంటూ వెళుతున్నాడు. 

అదే సమయంలో మాంగే  రామ్  అనే వ్యక్తి వేగంగా కారు నడుపుతూ మనీశ్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మనీశ్.. చికిత్స పొందుతూ జూన్  1న చనిపోయాడు. ‘‘మాంగే రామ్  వేగంగా, నిర్లక్ష్యంగా, ర్యాష్ గా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగింది. దీంతో మనీశ్  తీవ్రంగా గాయపడి చనిపోయారు. మనీశ్ పై భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు, తల్లి ఆధారపడి ఉన్నారు. వారందరూ పరిహారానికి అర్హులు” అని జడ్జి స్పష్టం చేశారు.

తాగి నడిపినట్లు ఆధారాలు లేవు

మాంగే రామ్​ మద్యం సేవించి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఇన్సూరెన్స్ కంపెనీ వాదించింది. బీమా నియమాలను ఉల్లంఘించారు కాబట్టి పరిహారం చెల్లించలేమని తెలిపింది. అయితే, ఈ వాదనను ట్రిబ్యూనల్ జడ్జి తోసిపుచ్చారు. మాంగే రామ్​ మద్యం మత్తులో కారు నడిపాడని ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించలేదని అన్నారు. మృతుడి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం  చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.