ఎలుక లాంటి చుగ్​.. సింహం లాంటి కేసీఆర్

ఎలుక లాంటి చుగ్​.. సింహం లాంటి కేసీఆర్
  • దేశానికే ఆదర్శమైన పథకాలు రాష్ట్రంలో అమలైతున్నయ్​
  • ఎలుక లాంటి చుగ్​.. సింహం లాంటి కేసీఆర్​ను నాదిర్​షాతో పోలుస్తరా?
  • కాంగ్రెస్​, బీజేపీ నేతలు కోతులు, 
  • కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని కామెంట్

హైదరాబాద్​, వెలుగు: దేశ ప్రజలు కేసీఆర్​ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శమైన ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. మంగళవారం టీఆర్​ఎస్​ఎల్పీలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్​సర్​లో ఎమ్మెల్యేగా గెలవలేని తరుణ్​ చుగ్​కు కేసీఆర్​ను విమర్శించే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. చుగ్​ వయసు కేసీఆర్​ రాజకీయ అనుభవమంతైనా లేదని విమర్శించారు. ‘‘ఎలుకలాంటి చుగ్​.. సింహం లాంటి కేసీఆర్​ను నాదిర్​ షాతో పోలుస్తారా? అమిత్​ షానే తెలంగాణ పాలిట నాదిర్​ షా. గుజరాత్​ నుంచి వచ్చి తెలంగాణపై దండెత్తుతున్నారు. కేసీఆర్​ తెలంగాణ లోకల్​..వోకల్. గుజరాత్​ బేరగాళ్లతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? చండీగఢ్​ మున్సిపల్​ ఎన్నికల్లో ఓడిన పార్టీ.. ఇక్కడ గెలుస్తుందా? ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణానే. కేసీఆర్​ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కొందరు అష్ట దరిద్రులుగా మారిపోయారు’’ అని అన్నారు.

జగ్గారెడ్డి ప్రశ్నలకు రేవంత్​ జవాబు చెప్పాలె
యాసంగి రైతుబంధు మంగళవారం నుంచి అమలవుతోందని, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లోనైనా అలాంటి స్కీం ఉందా? అని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​, బీజేపీ నేతలు కోతులు, కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కరోనా రూల్స్​ కేంద్రం పెట్టినవేనని, వాటి గురించి సంజయ్​, రేవంత్​కు తెలియదా? అని ప్రశ్నించారు. అక్కరకు రాని విషయాలపై వాళ్లిద్దరూ రచ్చ చేస్తున్నారన్నారు. ఆ రెండు పార్టీల నేతలు నాంపల్లి బ్రదర్స్​లా కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. సోషల్​ మీడియాలో హల్​చల్​ చేయడం తప్ప వాళ్లను జనం పట్టించుకోవడం లేదన్నారు. అబద్ధాలకు రేవంత్​, అరాచకాలకు సంజయ్​ ప్రతినిధులన్నారు. జగ్గారెడ్డి ప్రశ్నలకు రేవంత్​ ఆన్సర్‌‌‌‌ చెప్పాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​కు 150 ఎకరాల భూమే లేదని, అలాంటప్పుడు అన్ని ఎకరాల్లో వరి వేశారనేది అబద్ధమన్నారు. రేవంత్​ ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతోందన్నారు.