స్పోర్ట్స్​ స్థలాలు అమ్మేందుకు సర్కార్​ కుట్ర

స్పోర్ట్స్​ స్థలాలు అమ్మేందుకు సర్కార్​ కుట్ర
  • శాప్‌ మాజీ చైర్మన్‌ రాజ్‌ ఠాకూర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, వెలుగు: సిటీలో విలువైన ఏరియాల్లో ఉన్న స్పోర్ట్స్‌ స్డేడియాలు, కాంప్లెక్స్​ల భూములను అమ్మేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఉమ్మడి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) మాజీ చైర్మన్‌ రాజ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ఇందులో భాగంగానే గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్‌ టవర్‌ను ‘టిమ్స్‌’ హాస్పిటల్‌కు ఇచ్చిన సర్కారు, మరో ఐదెకరాలను కూడా కేటాయించిందని, వెనక్కి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఆదివారం ఫతే మైదాన్‌ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బంగారు పతకాల తెలంగాణ చేస్తాం అంటున్న సీఎం కేసీఆర్‌కు క్రీడాభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.  దశాబ్దాలుగా కాంట్రాక్ట్‌ కోచ్‌లను రెగ్యులరైజ్‌ కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్​బీస్టేడియం శిథిలమవుతుండగా, మరోవైపు స్టేడియాలను  నిర్వీర్యం చేసి  వాటిని అమ్మేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్‌ వేస్తున్నారని ఆరోపించారు. స్టేడియాల జోలికొస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.