3 నెలల పాటు అద్దె వసూలు చేయ‌కూడ‌దు: తెలంగాణ స‌ర్కార్

3  నెలల పాటు అద్దె వసూలు చేయ‌కూడ‌దు: తెలంగాణ స‌ర్కార్

లాక్ డౌన్ కార‌ణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి నెలకొంది. ఉపాధి కోల్పోయి జీవనం సాగించడం కష్టంగా మారిన నేప‌థ్యంలో మార్చి నుంచి 3 నెలల వరకు ఇంటి య‌జ‌మానులు అద్దెలు వసూలు చేయ‌కూడ‌ద‌ని తెలంగాణ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెల‌ల త‌ర్వాత వాయిదా ప‌ద్దతిలో తీసుకోవాల‌ని ఆదేశించింది.

కోవిడ్ 19 విస్తరణ – దాని నిలువరణ కోసం అమలు చేస్తోన్న లాక్ డౌన్ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 38 (2) (1), ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897 ల ప్రకారం మూడు నెలలపాటు ఇళ్ల అద్దె వసూలు చేయరాదని యజమానులకు ప్రభుత్వ ఆదేశమిచ్చింది. మూడు నెలల తరువాత ఆ మొత్తాన్ని సులభ వాయిదాల్లో తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మూడు నెలల అద్దె బకాయిలకు యజమానులు ఎలాంటి వడ్డీని వసూలు చేయకూడదని ఆదేశమిచ్చింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్టు 1897, సెక్షన్ 3 ప్రకారం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు 2005 సెక్షన్ 51 నుంచి 58 ల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిప‌ల్ కమిషనర్లకు ఈ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

TS government orders to house owners do not collect rent from tenants for 3 months