మళ్లీ తెగించిన ట్విట్టర్‌.. ఈ సారి యాక్షన్ తప్పదా?

మళ్లీ తెగించిన ట్విట్టర్‌.. ఈ సారి యాక్షన్ తప్పదా?

న్యూఢిల్లీ: కొత్త ఐటీ రూల్స్ విషయంలో కొన్ని రోజులుగా కేంద్రంతో ఫైట్​ చేస్తున్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా మరో దుమారం రేపింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ యూటీలు మన దేశంలో భాగంకావని, అవి రెండూ ప్రత్యేక దేశాలన్నట్లుగా ఇండియా మ్యాపునే తప్పుగా చూపించింది. ట్విట్టర్​కు చెందిన ట్వీప్ లైఫ్​సెక్షన్​లో ప్రపంచవ్యాప్తంగా తమ ఆఫీసులు ఏయే దేశాల్లో ఉన్నాయో చూపేందుకు వరల్డ్ మ్యాపుపై ఆ కంపెనీ తమ పిట్ట బొమ్మలను ఉంచింది. అయితే జమ్మూకాశ్మీర్, లడఖ్ సెపరేట్ కంట్రీస్ అన్నట్లుగా ఔట్ లైన్స్ గీసి, వేర్వేరు కలర్స్ తో చూపించింది. ఈ మ్యాపును ఓ ట్విట్టర్ యూజర్ గుర్తించి ఫ్లాగ్ చేయడంతో వైరల్ అయింది. మన దేశం మ్యాపును తప్పుగా చూపించడంపై సోమవారం నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇండియా అంటే ట్విట్టర్ ఏమాత్రం లెక్కచేయడం లేదని, దానికి గట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్ గతంలోనూ మన దేశం మ్యాపును తప్పుగా చూపించింది. నిరుడు అక్టోబర్​లో లడఖ్​లోని లేహ్​ను చైనాలో భాగం అన్నట్లుగా చూపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయి నోటీసులు ఇవ్వడంతో తప్పును సరిదిద్దుకుంది.  

కేంద్రం వర్సెస్ ట్విట్టర్ 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ఐటీ రూల్స్ అమలుకు ట్విట్టర్ ఒప్పుకోకపోవడంతో గత కొన్నిరోజులుగా కేంద్రం, ట్విట్టర్ మధ్య గొడవలు ముదిరాయి. కొత్త రూల్స్​ అమలు చేసేందుకు చాలా చాన్సులు ఇచ్చినా ట్విట్టర్ పట్టించుకోకపోవడంతో ఆ కంపెనీకి మధ్యవర్తి హోదాను కేంద్రం ఇటీవల తొలగించింది. దీంతో ట్విట్టర్​లో ఎవరైనా చట్ట వ్యతిరేక పోస్టులు పెడితే వాటికి ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం దేశంలో ట్విట్టర్ యూజర్ల సమస్యలను పరిష్కరించడం కోసం నియమించిన గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చతుర్ ఆదివారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో  కాలిఫోర్నియాకు చెందిన జెరెమీ కెస్సెల్ ను ట్విట్టర్ నియమించింది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న సోషల్ మీడియా సంస్థలు మన దేశంలోని వ్యక్తులనే చీఫ్​కంప్లయన్స్, నోడల్, గ్రీవెన్స్ ఆఫీసర్లుగా నియమించాలని స్పష్టంగా పేర్కొంటున్నా.. ట్విట్టర్ బేఖాతరు చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్ ను కూడా ఆ కంపెనీ శుక్రవారం గంటపాటు నిలిపివేసింది. టీవీ చానెల్స్ లో వచ్చిన తన ఫొటోలను మంత్రి ట్విట్టర్​లో పెట్టగా.. కాపీరైట్ ఉల్లంఘన అంటూ అకౌంట్​ను ఆపేయడంపై విమర్శలు వస్తున్నాయి. 

ఈసారి యాక్షన్ తప్పదా?

ఇదివరకే ఓసారి వార్నింగ్ ఇచ్చినా, దేశం మ్యాపును ట్విట్టర్ మళ్లీ తప్పుగా చూపించ డంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ సీరియస్ గా ఉన్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ట్విట్టర్​పై పెనాల్టీలు వేయడం, మ్యాపును తప్పుగా చూపడానికి కారణమైన అధికారులకు ఏడేండ్ల జైలు శిక్ష,  ఐటీ రూల్స్ లోని సెక్షన్ 69ఏ కింద ట్విట్టర్​ను బ్లాక్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. ట్విట్టర్​ వెబ్​సైట్లో మన దేశ మ్యాపును తప్పుగా చూపడం, జమ్మూ కాశ్మీర్​, లడఖ్​లను సెపరేట్​ దేశాలుగా మార్క్​ చేయడా న్ని నెటిజన్లు తప్పుబడుతు న్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. దీంతో ట్విట్టర్​ ​స్పందించింది. సోమవారం రాత్రి 9 తర్వాత తన సైటు నుంచి మ్యాపును తీసేసింది.