కొంపముంచిన కరోనా… 78 ఐఫోన్లు మాయం

కొంపముంచిన కరోనా… 78 ఐఫోన్లు మాయం
ఐఫోన్ల దొంగతనం కేసులో ఇద్దరు అమెజాన్ మాజీ ఉద్యోగులు అన్షార్ , నవాబ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్ లోని జమాల్ పూర్ గ్రామంలో అమెజాన్ యూనిట్ ఉంది. ఆ యూనిట్ కు వచ్చిన ప్రాడక్ట్స్ ను ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న కష్టమర్లకు ప్యాకింగ్ చేసి అక్కడి నుంచి డెలివరీ చేస్తారు. అయితే ఆ యూనిట్ లో సుమారు 78 ఐఫోన్లు మాయమవ్వడంపై అమెజాన్ కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అమెజాన్ కు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రతీపాల్ సాంగ్వాన్  మాట్లాడుతూ.., అమెజాన్ లో పనిచేసిన మాజీ ఉద్యోగులు  అమెజాన్ యూనిట్ లో ఉన్న  ఐఫోన్లను మాయం చేసినట్లు,  సెప్టెంబర్ నుంచి ప్రతీ రోజు ఐఫోన్లను దొంగతనం చేసినట్లు చెప్పారు. కరోనా కారణంగా తీసుకొచ్చిన సోషల్ డిస్టెన్స్ నిబంధనల్ని ఆసరాగా చేసుకొని సుమారు రూ.కోటి విలువ చేసే ఐఫోన్లను దొంగిలించినట్లు కన్ఫామ్ చేశారు. సాధారణంగా అమెజాన్ యూనిట్ కు  వచ్చే సమయంలో, వెళ్లే సమయంలో చెక్ చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆ పనిచేయకపోవడంతో భారీ ఎత్తున ఐఫోన్లు మాయమయ్యాయి. ఓ సమయంలో యూనిట్లో ఎన్ని ఐఫోన్లు ఉన్నాయనే విషయాన్ని అమెజాన్  సంస్థ ప్రతినిధులు పరిశీలించగా.., ఓ బాక్స్ లో ఉన్న 78 ఐఫోన్లు మాయమైనట్లు, ఈ ఐఫోన్ల గురించి ఆరా తీయడంతో..,  అప్పటి నుంచి ఇద్దరు నిందితులు ఉద్యోగం మానేశారని  తమ విచారణలో తేలిందని ఏసీపీ ప్రతీపాల్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్న ఏసీపీ.., ఐఫోన్ల ఖరీదు సుమారు రూ. కోటి ఉంటుందన్నారు.