కామాంధుడిని రాళ్లతో తరిమికొట్టిన బాలికలు

కామాంధుడిని రాళ్లతో తరిమికొట్టిన బాలికలు
  • జగిత్యాల జిల్లా రామారావుపల్లెకు చెందిన బాలికలు
  • ఒంటరిగా ఉంటే శంషాబాద్ లో ఘోరం జరుగుతుందని
  • బాలికలను భయపెట్టిన నిందితుడు
  • సేఫ్ గా తీసుకువెళ్తానని నమ్మించిన నిందితుడు
  • రేప్ చేయడానికి ప్రయత్నించడంతో ప్రతిఘటించిన బాలికలు
  • రాళ్లతో దాడి చేసి తప్పించుకున్న బాలికలు
  • కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పేరెంట్స్

ఒంటరిగా ఉన్న బాలికలపై ఓ దుర్మార్గుడు కన్నేశాడు. మాయమాటలతో బోల్తా కొట్టించాలని చూశాడు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలను సాకుగా చెప్పి… లిప్ట్ ఇస్తానని నమ్మించాడు.  గుట్టల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడటంతో… బాలికలు తిరగబడ్డారు. అక్కడ ఉన్న రాళ్లతో దాడి చేసి.. చాకచాక్యంగా తప్పించుకున్నారు.

లిప్ట్ ఇస్తానని నమ్మించి..రేప్ చేయబోయిన ఓ వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్నారు ఇద్దరు బాలికలు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామారావుపల్లెకు చెందిన ఇద్దరు బాలికలు… రాయికల్ వెళ్లేందుకు గ్రామ శివారులో నిలబడ్డారు. వారిపై కన్నేసిన ఒకడు లిప్ట్ ఇస్తానని అమ్మాయిల దగ్గరకు వచ్చాడు. ఒంటరిగా ఉంటే ఏదైన జరిగే ప్రమాదముందని నమ్మించాడు. శంషాబాద్ లో జరిగినట్టు జరిగే చాన్స్ ఉందని భయపెట్టాడు. తాను అటువైపే వెళ్తున్నానని, మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్తానని నమ్మించాడు. మొదట్లో ఆ ఇద్దరూ ససేమిరా అన్నారు. ఆ వ్యక్తి బాగా నమ్మించడంతో .కొంత టెన్షన్ తోనే నమ్మి బైక్ ఎక్కారు.

మాయమాటలు చెప్పి నమ్మించిన ఆవ్యక్తి కుంచెం వేణు. కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కుంచెం వేణు..అమ్మాయిల్ని ట్రాప్ చేయాలని స్కెచ్ గీశాడు. మాయమాటలతో నమ్మించి అమ్మాయిల్ని బైక్ పై ఎక్కించుకోని…అయిలాపూర్ శివారు గుట్టల్లోకి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన అమ్మాయిలు..ఎటు తీసుకెళ్తున్నావని వేణుని ప్రశ్నించారు. పొలం దగ్గరికి వెళ్లి మోటార్ వేసి..అటు నుంచే వెళ్ధామని మరోసారి నమ్మించాడు. అమ్మాయిల్ని గుట్టల్లోకి తీసుకెళ్లిన వేణు..వాళ్లని బెదిరించాడు. దగ్గరున్న డబ్బు, బంగారం లాక్కున్నాడు. అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయిలు బెదరలేదు. ఎదురుతిరిగారు. వేణుపై రాళ్లతో దాడి చేసి… చాకచాక్యంగా తప్పించుకున్నారు.

దగ్గర్లో ఉన్న గ్రామానికి చేరుకున్న బాలికలు…స్థానికుల దగ్గర ఫొన్ తీసుకొని పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. తమ పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడినవాడిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు కుంచెం వేణును అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అపరిచితులను ఎవరూ నమ్మొద్దని సూచించారు పోలీసులు.

అత్యాచార ఘటనను ధైర్యంగా ఎదుర్కొన్న బాలికలను అందరూ ప్రశంసిస్తున్నారు.  చిన్న పిల్లలైన సమయస్ఫూర్తితో తప్పించుకున్నారని, దిశ లాంటి మరో ఘోరం జరగకుండా..ప్రాణాల్ని కాపాడుకున్నారని మెచ్చుకున్నారు. అపరిచితుల్ని నమ్మవద్దని చెప్తున్నారు స్థానికులు. అమ్మాయిలపై అత్యాచారాయత్నం చేయబోయిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.