గ్లోబల్ వార్మింగ్ కారణంగానే.. ప్రకృతి విపత్తులు వస్తున్నయ్: కేంద్ర మంత్రి తోమర్

గ్లోబల్ వార్మింగ్ కారణంగానే.. ప్రకృతి విపత్తులు వస్తున్నయ్: కేంద్ర మంత్రి తోమర్

హైదరాబాద్, వెలుగు : గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని, ఫలితంగా అగ్రికల్చర్ సెక్టార్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వీటిపై జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్​లో ప్రధానంగా చర్చిస్తామని ప్రకటించారు. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం కృషి చేస్తున్నదన్నారు. గురువారం హైదరాబాద్​లో ‘జీ20 అగ్రికల్చర్ మినిస్టర్స్’ మీటింగ్ ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రులు శోభ కందర్లాజే, కైలాష్ చౌదరీతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జీ20 దేశాలతో కలిసి పనిచేసేందుకు ఇండియా సిద్ధంగా ఉంది.

ఇండియాతో పాటు చాలా దేశాలు వాతావరణ మార్పుల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. జీ20 సదస్సులో చర్చల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. ఆహార భద్రత, పోషకాహారం, డిజిటల్ టెక్నాలజీ, వ్యవసాయ, వాణిజ్య వ్యాపారం తదితర అంశాలపై చర్చిస్తాం. మీటింగ్స్ ముగింపు రోజున రోడ్​మ్యాప్ విడుదల చేస్తాం’’అని తోమర్ తెలిపారు.

వ్యవసాయ రంగం వారసత్వ సంపద

వ్యవసాయరంగం భారతీయ వారసత్వ సంపద అని, దేశంలో కృషి విజ్ఞాన కేంద్రాలు, ఎఫ్‌‌పీఓలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలతో అతిపెద్ద అగ్రికల్చర్‌‌ నెట్‌‌వర్క్‌‌ ఉందని తోమర్ అన్నారు. ‘‘జీ20 అగ్రికల్చర్ మీటింగ్స్​కు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు హాజరవుతున్నాయి. సభ్య దేశాల మధ్య సాగు రంగంలో సహకారమే లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నాం. ఒప్పందాలు కూడా జరుగుతాయి. వివిధ దేశాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర ప్రభుత్వం ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు లక్ష్యంతో జీ20 అగ్రికల్చర్ సమిట్ నిర్వహిస్తున్నాం”అని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

దశలవారీగా క్రాప్ డైవర్ఫికేషన్

వ్యవసాయంలో 20 దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలనేదే సదస్సు ఉద్దేశమని తోమర్​ తెలిపారు. ప్రధాని మోదీ సూచన మేరకు ఈఏడాదిని ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్‌‌ను ప్రోత్సహిస్తున్నామన్నారు. దీని కోసం స్పెషల్ ఎగ్జిబిషన్‌‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రాప్‌‌ డైవర్ఫికేషన్‌‌ (పంటల వైవిధ్యాన్ని) ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. రాష్ట్రాలతో చర్చలు జరిపి దశలవారీగా పంటల వైవిధ్యాన్ని అమలు చేస్తామన్నారు.

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదని, దీని కోసం ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. పంట నష్టాన్ని తగ్గించేందుకు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.