ఆ కారు ఎంత స్పీడ్లో వెళుతుంటే.. ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంది..!

ఆ కారు ఎంత స్పీడ్లో వెళుతుంటే.. ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంది..!

హైవే ఎక్కితే చాలు కారు స్పీడ్ జోరుగా ఉంటుంది. అందులోనూ హై ఎండ్ కార్లు అయితే స్పీడ్ 100 కిలోమీటర్లకు తగ్గదు. కాకపోతే సిట్యువేషన్ తగ్గట్టు స్పీడ్ ఉంటే పర్వాలేదు.. అలా కాకుండా కనీసం జ్ణానం లేకుండా వెళితేనే ప్రమాదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కారు ప్రమాదం సీసీకెమెరా విజువల్స్ షాక్ కు గురి చేస్తున్నాయి. వామ్మో ఏంటీ యాక్సిడెంట్ అనే గుండెలు పట్టుకుంటున్నారు జనం. 

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురం గ్రామం. ఇది జాతీయ రహదారి. ఒడిశాలోని పూరి జగన్నాథుడి దర్శనం చేసుకున్న వ్యక్తులు.. కారులో బయలుదేరి పర్లాభిమిండి వెళుతున్నారు. మార్గమధ్యలో నెమలి నారాయణపురం వరకు వచ్చారు. అప్పటికే కారు స్పీడ్ 100 కిలోమీటర్లపైనే ఉంది. జోరున వర్షం పడుతుంది. 

వర్షంలోనూ స్పీడ్ తగ్గని ఇన్నోవా కారు.. రోడ్డుపై బ్రేక్ వేశారు డ్రైవర్. అంతే కారు స్కిడ్ అయ్యింది. జారిపోయింది. అంత స్పీడ్ లో అదుపు తప్పిన కారు.. పల్టీలు కొట్టుకుంటూ.. డివైడర్ దాటి.. రోడ్డుకు అవతలి వైపుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. లారీని ఢీకొన్న ఇన్నోవా కారు.. రోడ్డు పక్కకు పల్టీలు కొట్టింది. 

లారీ నిదానంగా వస్తుండటంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆ సమయంలో అక్కడ లారీ కాకుండా మరో కారు ఏదైనా ఉండి ఉంటే ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగా ఉండేదని సీసీ కెమెరా విజువల్స్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారుదే పూర్తి తప్పు అని విజువల్స్ చూస్తే తెలుస్తోంది. 

కారులోని ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.