IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన హైటెన్షన్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన లక్నో SRHని కేవలం 156 పరుగులకే కట్టడి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (62), నితీశ్ కుమార్ రెడ్డి (56) అద్భుతమైన హాఫ్ సెంచరీలు చేయడంతో ఆరెంజ్ ఆర్మీ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. దీంతో 157 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకి మంచి శుభారంభం దక్కింది.
ఓపెనర్లు ఐడెన్ మార్ క్రమ్, మిచెల్ మార్ష్ మధ్య 37 పరుగుల భాగస్వామ్యానికి ఎలీషా మలింగ బౌలింగ్ లో మార్ష్ (14) ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ ( 50 బంతుల్లో 9 ఫోర్లతో 68 పరుగులు) సూపర్బ్ అర్థ శకతంతో జట్టుకి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ వైపు దూసుకెళ్తున్న మార్క్రమ్ (27 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సులతో 45 పరుగులు)ని 77 పరుగుల వద్ద శివాంగ్ కుమార్ పెవిలియన్ కి పంపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోని పెద్దగా ప్రభావం చూపించలేదు.. కేవలం 12 రన్స్ చేసి హర్ష్ దూబే బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు.
ఇక బ్యాటింగ్ కి వచ్చిన విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచాడు. కేవలం 1 పరుగు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో 105 పరుగులకే కీలకమైన 4 వికెట్లని కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుని ఆదుకునే క్రమంలో అబ్దుల్ సమద్ (16)ని హర్ష్ దూబే అవుట్ చేసేశాడు. ఇక 6 బంతుల్లో 9 పరుగులు అవసరమైన సమయంలో చివరి ఓవర్ వేసిన ఉనద్కత్ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టి లక్నో సూపర్ జెయింట్స్ కి విజయాన్ని అందించాడు కెప్టెన్ పంత్.
